ఏపీలో చంద్రబాబు కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఎలా చేపడతారో క్లారిటీలేదు. ఇవాళ రేపు విస్తరణ జరిగిపోతుందంటూ చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆశావహులంతా నిరీక్షిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వలసలకు, మంత్రివర్గ విస్తరణకు ఒక చిన్న లింకు ఉన్నదని అందరి అభిప్రాయం. విస్తరణ జరిగే వరకు మంత్రి పదవుల మీద ఆశతో, లేదా మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ జరిగితే ఇతర నామినేటెడ్ పదవులు దక్కుతాయనే ఆశతో వలసలు జోరుగా ఉంటాయి. ఒకసారి అదంతా పూర్తయిన తరువాత.. ఇక వలసలు ఆగిపోతాయి.. అని పలువురు భావిస్తున్నారు. అయితే తాజాగా కేబినెట్ భేటీ తర్వాత మీడియతో ముచ్చట్లలో ప్రస్తుతం ఎండల సంగతి చూడనివ్వండి కేబినెట్ విస్తరణ సంగతి ఇప్పుడెందుకు? అని చంద్రబాబు ప్రశ్నించిన నేపథ్యంలో… విస్తరణ ఇప్పట్లో ఉండదని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విస్తరణ వరకు వైకాపా నుంచి వలసలు సాగుతూనే ఉంటాయని, డెడ్ లైన్ ఇంకా చాలా దూరం ఉన్నదని అంటున్నారు.
రాజ్యసభ ఎన్నికల పర్వం ముంచుకొచ్చేలోగా ఎమ్మెల్యేల వలసలను పూర్తి చేసేయాలని , రాష్ట్రానికి దక్కే మొత్తం నాలుగు స్థానాలను కూడా తెలుగుదేశం దక్కించుకోవాలని చూస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అంటే.. రాజ్యసభ ఎన్నికల పర్వమే.. వైకాపా నుంచి వలసలకు డెడ్ లైన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అలాంటి వాతావరణం ఏమీ లేదని.. ఇంకా చాలా సమయం ఉందని, ఆ ఎన్నికలు కీలక ఘట్టమే అయినప్పటికీ.. కేబినెట్ విస్తరణ వరకు కూడా వలసలు జరుగుతూనే ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
పదవులు, పనులు మీది ఆశ చూపే వలసలు వచ్చే వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది. కేవలం టికెట్ గ్యారంటే అంటే ఎక్కువ మంది రాకపోవచ్చు. ప్రతిపక్షంలో ప్రస్తుతం పదవిని భరించడం భారం అయిపోతున్న నేపథ్యంలో… అధికార పార్టీలోకి ఆశలతో వచ్చే వారే ఉంటారు గనుక.. వారిని ఎప్పటికీ రాబట్టుకునే అవకాశం ఉంటుందని తెలుగుదేశం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.