నంద్యాల ఉప ఎన్నిక విజయం తరువాత రాయలసీమపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. సీమకు చెందిన నాయకుల్ని ఆకర్షించే పనిని ఒక లక్ష్యంగా పెట్టుకుందని చెప్పొచ్చు. సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలంటే, ఆ వర్గానికి చెందిన నేతలకి పార్టీలో పెద్దపీట వేయాలి కదా! అందుకే, ఈ బాధ్యతల్ని కొంతమంది మంత్రులకు ప్రత్యేకంగా అప్పగించినట్టు సమాచారం. సీమ జిల్లాల్లో టీడీపీలోకి వచ్చే రెడ్డి సామాజిక వర్గ నాయకుల్ని గుర్తించడం, ఆహ్వానించడం, స్థానిక టీడీపీ నేతలతో ఆయా వర్గాలకు సయోధ్య కుదర్చడం వంటివి ఆ మంత్రుల బాధ్యతలుగా చెబుతున్నారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలకు ఆకర్ష్ లక్ష్యాలను ఇచ్చారట! ప్రస్తుతం వీరంతా ఆ లక్ష్య సాధనలో తలమునకలై ఉన్నారని చెబుతున్నారు.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలోకి వస్తే మైదుకూరు నియోజక వర్గంతోపాటు కడప జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీకి బలం పెరుగుతుందనేది పార్టీ అధినాయకత్వం అంచనాగా తెలుస్తోంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుతం కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఈ మధ్యనే జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో తరచూ టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. నిజానికి, బైరెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. పార్టీ నుంచి బయటకి వచ్చి గత ఎన్నికల సమయంలో ఒక పార్టీని కూడా పెట్టారు. కానీ, ఇప్పుడా పార్టీ కనుమరుగైపోయింది. దీంతో ఇప్పుడు బైరెడ్డిని టీడీపీలోకి తెస్తే… కర్నూలు జిల్లాలో ఆ సామాజిక వర్గం మద్దతు పెరుగుతుందనేది వారి అంచనా! డీఎల్ విషయంలో కూడా సోమిరెడ్డి చురుకైన కృషి చేస్తున్నారట.
ఇక, మంత్రి ఆదినారాయణ రెడ్డి విషయానికొస్తే… ఆయన కూడా డీఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. మంత్రి అమర్ నాథ్ రెడ్డి ప్రస్తుత టార్గెట్.. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డికి పచ్చ కండువా కప్పడం! ఇప్పటికే ఆయనతో మంత్రి అమర్ నాథ్ చర్చలు జరిపారట. దీంతోపాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఇతర నేతలపై కూడా ఈ మంత్రులు దృష్టి సారిస్తున్నారనీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కొందరి చేరిక విషయమై గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందనీ, ఆ తరువాత ఇంకొన్ని కొత్త పేర్లు కూడా తెరమీదికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, టార్గెట్ చేసుకుని మరీ రాయలసీమలో సామాజిక వర్గ సమీకరణాలపై టీడీపీ దృష్టిపెట్టిందని అర్థమౌతోంది!