భారత యుద్ధంలో అనేక వ్యూహాలు పన్ని చూపించారు అప్పటి సైన్యాధ్యక్షులు భీష్మ, ద్రోణులు. రేపటి వ్యూహం ఏమిటి అన్నది నేడు డిసైడ్ చేసేవారు. ఇప్పుడు జరుగుతున్నది ఆధునిక ఎన్నికల యుద్ధం. ఇక్కడా వ్యూహాలు తప్పవు. ఈసారి తెలుగుదేశం ఎన్నికల వ్యూహాల జాబితాలో అవినీతి అస్త్రం చోటుచేసుకోదు అని ముందుగానే అందరూ ఊహించారు. ఎందుకూ అంటే గత అయిదేళ్ల పాలన తెలుగుదేశానిదే. పైగా జనం ఇప్పుడు రాజకీయ అవినీతి పెద్దగా భూతద్దంలో చూడడం మానేసారు అని అర్థం అయిపోయింది. నువ్వేం తిన్నావు అన్నది కాదు, నాకేం ఇచ్చావు అన్నది ఇక్కడ పాయింట్ గా మారిపోయింది. అందువల్ల ఈసారి తెలుగుదేశం, పాతబడిపోయిన జగన్ లక్షకోట్ల వ్యూహాన్ని మరి బయటకు తీయదు అని అనుకున్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ ఈసారి రెండు వ్యూహాలు రెడీ చేసింది. అయిదేళ్ల అభివృద్ధి, మోడీ-కేసిఆర్-జగన్ దోస్తానా అనే రెండుబలమైన వ్యూహాలు. అందులోనూ ఈ రెండో వ్యూహం బాగా వర్కవుట్ అవుతుందన్న బలమైన నమ్మకంతో వుంది. ఇక రెగ్యులర్ విమర్శలు మామూలే.
అయితే ఎన్నికల తేదీలు బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం అర్జెంట్ అవినీతి వ్యూహం ఆరంభంలోనే పన్నేసింది. ఎందుకు అలా? అన్నది దేశం పెద్దలకే తెలియాలి. కానీ అది ఏమాత్రం విజయం కాలేదన్నది వాస్తవం. జనాలు ఆ అవినీతి వార్తను చాలా అంటే చాలా లైట్ తీస్కున్నట్లు కనిపించింది. అయిదేళ్లు సైలంట్ గా వుండి, ఎన్నికల ముందు మళ్లీ అదే పాత అస్త్రం బయటకు తీసి, అదే వ్యూహం పన్నేసరికి జనాలకు, ఇది మామూలే అన్నట్లు అయిపోయింది. పైగా రేపు ఇది రాబోతోంది అని ముందుగానే లీక్ అయిపోవడంతో సాక్షి ద్వారా అఫెన్స్ ఆట స్టార్ట్ చేసింది. దాంతో మరింత నీరసం అయిపోయింది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గమనించాల్సింది ఒకటి వుంది. ఒక మనిషిని అభిమానించినపుడు అది కూడా మాస్ హిస్టీరియా వున్నపుడు వ్యూహాలు వేరుగా వుండాలి. 2014లో వున్నదానికి అదనంగానే జగన్ చరిష్మా కనిపిస్తోంది అది వాస్తవం. అందువల్ల దాన్ని తగ్గించే ప్రయత్నం చేసే వ్యూహం కాదు పన్నాల్సింది. దాని వెనుక మూలకారణమైన శక్తులను ప్రొజెక్ట్ చేసే వ్యూహాలు పన్నాయి. మోడీ కేసిఆర్ జగన్ నెక్సెస్ ను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. అలాగే అదే సమయంలో తెలుగుదేశం ఇమేజ్ ను పెంచే అభివృద్ధి వ్యూహం అనే దాన్ని బలంగా వదలగలగాలి.
కానీ ఇప్పుడు తీరా ఎన్నికల టైమ్ వచ్చేసరికి దేశం నోట అభివృద్ధి మాట వినిపించడం లేదు. కేవలం జగన్ ను తక్కువ చేసే దాడి వ్యూహం మాత్రం కనిపిస్తోంది. వైఎస్ లేదా జగన్ మీద గత మూడు ఎన్నికలుగా ఈ అస్త్రం వాడి వాడి అరిగిపోయింది అన్న సంగతి దేశం గమనించాలి. నిన్నటి హిందూజా వార్త తరువాత తెలుగుదేశం వ్యూహకర్తలకు ఈ వైనం అర్థమై వుంటుంది. లేకపోతే ఈ తడబాటు ఇలా కొనసాగుతుంది.
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వుంది. ఇప్పుడు జనాల దృష్టి అంతా ఏ సీటు ఎవరికి అన్న దానిమీదే వుంది. అలాంటి టైమ్ లో ఇలాంటి సంచలన వార్త వదలడం అన్నది మరో తప్పు. ఏ వార్త ఎప్పుడు వదలాలో అప్పుడే వదలాలి అన్నది టీడీపీ మీడియా వింగ్ లోని సీనియర్ జర్నలిస్ట్ లకు తెలియదు అనుకోవాలా?
లేదా పనసకాయ దొరికన నాడే తద్దినం పెట్టేయాలని అనుకున్నట్లు దొరికిందే తడవుగా వదిలేసారా?