బీజేపీ, తెలుగు దేశం పార్టీల స్నేహం బాగానే పండింది. చక్కగానే నడుస్తోంది. కానీ ఆ స్నేహం వలన అవి ఏమయినా ప్రయోజనం పొందగలిగాయా? అంటే లేదనే చెప్పవచ్చును. తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నేతలు తెదేపాతో స్నేహాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తెదేపాతో స్నేహం వలన తమకు చాలా నష్టం వాటిల్లుతోందని అక్కడ బీజేపీ నేతలు భావిస్తుంటే, బీజేపీతో స్నేహం వలన ఆంధ్రాలో తమకు చెడ్డపేరు మూటగట్టుకోవలసి వస్తోందని తెదేపా నేతలు భావిస్తున్నారు. అయినప్పటికీ రెండు పార్టీల అధిష్టానాలు తమ భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొనో లేదో కటీఫ్ చెప్పుకోవడానికి ఇది తగిన సమయం కాదనో ఆలోచించి స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాకు దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. తెదేపాకు, చంద్రబాబు నాయుడుకి ఉన్న కొన్ని ‘నెగెటివ్ పాయింట్లు’ కారణంగానే దానితో పొత్తు పెట్టుకొన్న తాము నష్టపోతున్నామని తెలంగాణా బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో తెదేపాకు చంద్రబాబు నాయుడు కూడా దూరం అవుతున్నారు కనుక ఇక ఆ పార్టీ తెలంగాణాలో ఎంతో కాలం మనుగడ సాగించలేకపోవచ్చును. కనుక బీజేపీ నేతల చేతికి మసి అంటుకోకుండానే తెదేపాను వదిలించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెదేపాతో పొత్తు పెట్టుకోకపోయినా కూడా వారు తెరాస ప్రభంజనం ముందు నిలువలేరని స్పష్టమవుతోంది.
రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నిలద్రొక్కుకోవాలంటే కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరమనే ఆలోచనతోనే బీజేపీతో స్నేహానికి సిద్దపడ్డారు చంద్రబాబు నాయుడు. అయితే కేంద్రప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోకపోవడంతో ఆయన ఆశించిన ఆ ప్రయోజనం నెరవేరనే లేదు. ఆయన స్వయంగా ప్రధాని నరేంద్ర మోడిని కలిసి బ్రతిమాలుకొన్నా కూడా ఎటువంటి ప్రయోజనమూ కనబడలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును. కానీ అవేవీ వచ్చే ఎన్నికలలో తెదేపా ప్రభుత్వాన్ని కాపాడలేవు. ఒకవేళ రాష్ట్రంలో తెదేపా మునిగే పరిస్థితి ఉంటే, తెదేపాతో కలిసి సాగినా, తెగతెంపులు చేసుకొన్నా సరే దానితో బాటు బీజేపీ కూడా మునగడం తధ్యం. కానీ బీజేపీ ఏదో ఒక దూరాలోచనతోనే తెదేపాకు సహాయనిరాకరణ చేస్తోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. అదేమిటో మున్ముందు దానంతట అదే బయటపడవచ్చును.
కేంద్రప్రభుత్వం వైఖరితో చంద్రబాబు నాయుడు కూడా బాగా విసిగెత్తిపోయే ఉంటారు కానీ అది పైకి చెప్పుకోలేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చాలా సంయమనం పాటిస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఆవిధంగా ఉండగలరో చెప్పలేము కానీ ఏదో ఒకరోజు ఆయన కూడా గీత దాటవచ్చును. ఈలోగా రాష్ట్ర బీజేపీ నేతలే అందుకు సన్నాహాలు మొదలుపెట్టేసి ముహూర్తం పెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వారికీ తెదేపా తీరు బొత్తిగా నచ్చడం లేదు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెదేపా-బీజేపీలు స్నేహం కొనసాగుతున్నప్పటికీ దాని వలన ఆ రెండింటికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. ఇదేలాగుంది అంటే ‘ఆపరేషన్ సక్సెస్…పేషంట్ డెడ్’ అన్నట్లుంది. అయిష్టంగా సాగుతున్న వాటి కాపురం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో తెలియదు కానీ దాని వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నట్లు కనిపిస్తోంది.