అమరావతి మహోద్యమ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. అన్ని ప్రాంతాల నేతలూ హాజరయ్యారు. ప్రజారాజధానిగా అమరావతికి అందరి ఆమోదం లభించింది. ఈ విషయం చెప్పకుండా… సభా వేదికపై చంద్రబాబు కన్నా లక్ష్మినారాయణను దగ్గరకు రమ్మని పిలిచారని చెప్పి వైసీపీ నేతలు చర్చ లేననెత్తారు. మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందని .. టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీనేతలే చర్చలు ప్రారంభించారు. కన్నా లక్ష్మినారాయణ ఇప్పుడు కనీసం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాదు. ఆయనను దగ్గరకు తీయడం వల్ల పొత్తులు పొడుస్తాయని ఎలా భావిస్తున్నారో కానీ మొత్తంగా అయితే అమరావతి అంశాన్ని పక్కన పెట్టడానికయినా సరే ఎక్కువగా దాన్నే చర్చించినట్లుగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పొత్తుల అంశం ఎప్పుడూ హాట్ టాపికే. టీడీపీ ఒంటరిగా వెళ్లి ఘోరమైన దెబ్బతిన్నది. అదే సమయంలో జనసేన పార్టీతో కలిసి వెళ్లి ఉంటే కనీసం పరువైనా దక్కేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ మళ్లీ కలిసి… అదే సమయంలో వెల్లువలా ఉన్న ప్రజా వ్యతిరేకత పని చేస్తే వైసీపీకి గడ్డు కాలం చాలా సులువేనని రాజకీయ అంచనాలు ఉన్నాయి. జనసేన, బీజేపీ మళ్లీ టీడీపీతో కలవడానికి సిద్ధపడ్డాయన్న సంకేతాలు వస్తే ఏపీలో రాజకీయం మారిపోతుంది. గతంలో వైసీపీకి మద్దతు పలికిన ఓ బలమైన వర్గం … కూటమి వైపు వస్తుంది.
అది వైసీపీకి కోలుకోలేని దెబ్బతీస్తుంది. అందుకే.. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు..మంత్రులు కులం ప్రకారం వ్యాఖ్యలు చేసి దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య రాజకీయం ఊపందుకుంటోంది . అందుకే పొత్తుల చర్చలూ తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ చర్చలు ఎక్కువగా టీడీపీ, బీజేపీ, జనసేనల్లో కాకుండా.. ఆయా పార్టీల పొత్తుల గురించి వైసీపీలో చర్చించడమే ఇక్కడ మెయిన్ ట్విస్ట్.