మరోసారి ఈ అంశం తెర మీదికి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు సాధ్యమా అనే చర్చ మళ్లీ వార్తల్లోకి తెచ్చారు కాంగ్రెస్ నేతలు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేముంది అంటూ టీపీసీసీకి చెందిన ఒక ముఖ్యనేత వ్యాఖ్యానించినట్టు కథనాలు వచ్చాయి. గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. రాబోయే ఎన్నికలు తెలంగాణలో విభిన్నంగా జరుగుతాయనీ, ఈ క్రమంలో తెరాసపై పోరాటంలో భాగంగా టీడీపీతో కలిసి పనిచేస్తే తప్పు ఏముందనే అభిప్రాయాన్ని ఓ ముఖ్యనేత వ్యక్తీకరించారట. అయితే, ఇది సాధ్యమా అనేదే అసలు ప్రశ్న..?
గతంలో కూడా ఇదే అంశం తెరమీదికి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇదే ప్రతిపాదన తీసుకొచ్చారు. చివరికి ఆయనే టీడీపీ వదిలి, కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది. సైద్ధాంతికంగా చూసుకుంటే, కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు సాధ్యం కాదనే చెప్పాలి. తెలంగాణలో పరిస్థితులు వేరు కదా… ఇక్కడ పొత్తు పెట్టుకుంటే తప్పేముందని కాంగ్రెస్ నేతలు అనుకోవచ్చుగానీ… ఆ ప్రభావం ఆంధ్రాలో టీడీపీపై వేరే విధంగా ఉంటుందన్నదీ తెలిసిన విషయమే. అయినాసరే, కాంగ్రెస్ నేతలు పదేపదే ఈ అంశాన్ని ఎందుకు చర్చకు తీసుకొస్తున్నట్టు..? అంటే, హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాలతోపాటు, తెలంగాణలోని సెటిలర్లను ఆకర్షించడమే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
అందుకే, వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు ప్రాధాన్యత ఇస్తూ… వీలైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీమాంధ్రకు చెందిన నేతలకు తెరమీదికి తేవాలనే ఆలోచనలో టి. కాంగ్రెస్ ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ పార్టీపై గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదన్నది కొందరి విశ్లేషణ. నిజమే, వ్యతిరేకత లేకపోయినా కూడా… తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అసాధ్యమనే అనిపిస్తోంది. ఎందుకంటే, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అసంబద్ధంగా విభజించడం వల్లనే ఈరోజున నవ్యాంధ్ర సమస్యల్లో చిక్కుకుందనే అభిప్రాయం ఏపీలో ఇప్పటికీ ఉంది. కాబట్టి, కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా టీడీపీ ముందుకు రాలేదు. కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు అనూహ్యం. ఇంకోపక్క, తెరాస, టీడీపీలు దగ్గరైన క్రమాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా ఇప్పుడొక సానుకూల వాతావరణం ఏర్పడి ఉంది. అయితే, అది తెలంగాణలో పొత్తు రూపం దాల్చుతుందా అనేది ఇప్పట్లో చెప్పలేంగానీ… కాంగ్రెస్ పట్ల టీడీపీకి అనుకూల ధోరణి ఉండదని చెప్పడానికి ఇది మరో కోణం.