అక్టోబర్ నుంచి పాదయాత్ర చేస్తానంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైకాపా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ పార్టీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లో ఉంది. దాదాపు మరో రెండేళ్లపాటు ఎన్నికలకు సమయం ఉన్నా కూడా జనంలోకి ఎన్నికల మూడ్ ఎక్కించేందుకు వైకాపా సిద్ధమౌతోంది. దీనికి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా తగ్గడం లేదు! త్వరలో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమౌతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రుల కమిటీతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఈ కార్యక్రమానికి చేపట్టబోతున్నారు. దీనికి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ అనే పేరు పెట్టారు.
అన్ని నియోజక వర్గాలనూ కలుపుకుంటూ ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యనే పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామనీ, పార్టీలో పనిచేసేవారందరికీ గుర్తింపు లభించే చర్యలు చేపట్టామన్నారు. పదవులు పొందినవారు పార్టీ కోసం మరింత శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీలో అన్ని శ్రేణులూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే… అన్నీ సిద్ధం చేశాక పెత్తనం కోసం వైకాపా ఉవ్విళ్లూరుతోందని చంద్రబాబు మంత్రుల కమిటీతో చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా అధికార పార్టీ కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తోందనే చెప్పాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. మొదటి రెండు సంవత్సరాలూ కేసులతో అభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించందనే అంశాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. దీంతోపాటు కులాలు, సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోందనే ఆరోపణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలను వైసీపీ ఎలా అడ్డుకుంటోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, టీడీపీ కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తున్నట్టే. జగన్ పాదయాత్ర ప్రారంభం కంటే ముందుగానే అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమౌతుండటం విశేషం. ఇకపై, మంత్రులూ ఎమ్మెల్యేలు కూడా వారివారి నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు సమాచారం! తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. అంటే, ఏపీలో ఇకపై ప్రతిపక్షం, అధికార పక్షాల ప్రచార హోరు మొదలౌతుందన్నమాట.