తెలుగుదేశం పార్టీ తమ డేటా చోరీకి గురయిందని పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీ గ్రిడ్ అనే కంపెనీ టీడీపీ యాప్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేసి యాప్‌కు సంబంధించి టీడీపీ డేటాను మొత్తం తీసుకెళ్లారని, అది వైసీపీ నేతలకు అందించారని అనుమానిస్తోంది. తమ యాప్‌లోని డేటా వైసీపీ కార్యాలయానికి చేరినట్లు, వారి కాల్‌సెంటర్ ఉద్యోగులు టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న ఫోన్ కాల్స్ బయటకు రావడంతో వాటినే సాక్ష్యంగా చేసుకుంటోంది. అదే సమయంలో ఎటువంటి ఫిర్యాదు కేసు లేకపోయినా ఫిబ్రవరి 23వ తేదీన పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీలో అలజడి సృష్టించారు. ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ డేటా ఇవ్వాలని బెదిరింపులకు గురి చేశారు. ఆ తర్వాత మళ్లీ మార్చి రెండో తేదీన అర్థరాత్రి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని హార్డ్ డిస్కులు, సీపీయూలు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకెళ్లారు. వాటి నుంచి టీడీపీ యాప్‌లో ఉన్న సమాచారం అంతా బయటకు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది.
తెలుగుదేశం పార్టీ డేటా చోరీ గురించి ప్రధానంగా కేసు నమోదు చేస్తే అది సైబరాబాద్ పోలీసుల మీదకే వెళ్తుంది. ఎందుకంటే ఆ పోలీసులే, కేవలం ఓ వైసీపీ నేత ఫిర్యాదు ఆధారంగా ఐటీ గ్రిడ్ కంపెనీపై ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, కేవలం ఫిర్యాదు మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్నీ తీసుకెళ్లిపోయారు. ఆ డేటానే లీక్ అయిందని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ఆ డేటా దొంగతనం కోసమే ఈ కేసు పెట్టారని వాదిస్తోంది. సైబరాబాద్ పోలీసులకు టీడీపీ యాప్‌లో అక్రమంగా సమాచారం ఉందన్న ఒక్క ఆధారం కూడా దొకరలేదు. అందుకే ఎథికల్ హ్యాకర్లను తెప్పించి తాము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లో ఏమైనా ఉందేమో బయటకు తీస్తామని చెబుతున్నారు.
మరో వైపు ప్రభుత్వం కూడా సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఏపీ డేటా ఉందంటూ సజ్జనార్ వ్యాఖ్యలు చేయడమే కాదు, ఏపీ ప్రభుత్వంపై కేసు పెడతామని వ్యాఖ్యానించారు. అంతే కాదు, ఓ పోలీస్ అధికారి ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడారు. అచ్చంగా ఓ రాజకీయ నేత మాట్లాడినట్లు మాట్లాడారని ప్రభుత్వ వర్గాలు అంచనాకు వచ్చాయి. మంత్రి వర్గ సమావేశంలోనూ సజ్జనార్ తీరుపై చర్చ జరిగింది. అందుకే ప్రభుత్వ పరంగా సజ్జనార్ పై ఢిఫమేషన్ కేసును దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.