ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన.. కాంగ్రెస్ – టీడీపీ ఏకం కాబోతున్నాయి. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడమే చంద్రబాబు లక్ష్యమైనా – ఆ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోనూ పడుతుందన్నది సుస్పష్టం. ఇప్పుడు ఈ కీలకమైన మార్పు ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పైనా తనదైన ప్రభావం చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించడం వెనుక.. ఆత్మ గౌరవ నినాదం కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. అప్పట్లో కేంద్రంలోనూ, దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కొమ్ములు విరిచి ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ ప్రాంతీయ పార్టీ జెండా రెపరెపలాడడం కేవలం ఎన్టీఆర్ ఘనత. అప్పటి నుంచీ కాంగ్రెస్ – టీడీపీల మధ్య పోరాటం మొదలైంది. `ఎన్టీఆర్` బయోపిక్‌లో ఈ అంశానికీ చాలా ప్రధాన్యం ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఆయన పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీతోనే. ఆ సమయంలోనే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్నో నినాదాలు లేవనెత్తారు. కుటుంబ పాలనపై దుమ్మెత్తి పోశారు. ఇందుకు సంబంధించిన డైలాగులన్నీ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఉన్నాయి కూడా. ఇప్పుడు టీడీపీ – కాంగ్రెస్ తాజా దోస్తీతో ఆ డైలాగులకు కత్తెర్లు పడడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ సినిమా అచ్చంగా బాలయ్యది. అంటే.. పరోక్షంగా చంద్రబాబు నాయుడుది కూడా. ఈసినిమా వెనుక బాబు హస్తం ఉందని వేరే చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన ఈ తరుణంలో కాంగ్రెస్‌పై సినిమాల ద్వారా వ్యంగ్య బాణాలు సంధించే సాహసం చేయకపోవొచ్చు. అందుకే ఆయా డైలాగులకు కత్తెర వేయడం ఖాయమని తెలుస్తోంది. ‘మహానాయకుడు’ పార్ట్‌లో నే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు ఉన్నాయని, అవన్నీ ఇప్పుడు వినిపించబోవని సమాచారం.