తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు దిశగా ప్రధాన పార్టీల మధ్య చకచకా పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కూటమిలో అందరి దృష్టీ ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మీదే ఉంది. ఈ రెండు పార్టీల మధ్య నేరుగా పొత్తు ఉంటుందనీ, దాన్ని అవకాశంగా మార్చుకుని ఆంధ్రాలో విమర్శల దాడి పెంచొచ్చని ఎదురు చూస్తున్న పార్టీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అయితే, కాంగ్రెస్ తో టీ టీడీపీ డీల్ చేస్తున్న విధానం కూడా కాస్త స్మార్ట్ గా ఉందనే అనిపిస్తోంది. ‘నేరుగా కాంగ్రెస్ తో టీడీపీ ఒక్క పార్టీయే పొత్తు పెట్టుకోలేదు’ అనే అభిప్రాయం కలిగించే విధంగానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండటం గమనార్హం.
తెలంగాణలో పొత్తుల అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ భుజాన వేసుకుని వరుసగా పార్టీలను ఆహ్వనించడం మొదలుపెట్టారు! అయితే, ముందుగా కాంగ్రెస్ పార్టీతో ఆయన చర్చలు జరపకపోవడం గమనార్హం. ముందు సీపీఐతో చర్చలు జరిపారు. టీడీపీ, టీజేయస్, సీపీఐ… ఈ మూడు పార్టీలూ మహా కూటమిలో భాగంగా కలిశాయనే అభిప్రాయం కలిగించే విధంగా సంప్రదింపులు కొనసాగించారు. అంటే… ఒక కూటమి ఏర్పడ్డాక, ఆ కూటమిలోకి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నది మహా కూటమిగానీ… టీడీపీ మాత్రం కాదు అనే సందేశం ఇవ్వడమే ఈ వ్యూహం అమలు వెనక టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ తో టీడీపీ ఒక్క పార్టీయే పొత్తుల వ్యవహారం మాట్లాడితే… ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై జరుగుతున్న చర్చలకు మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఆంధ్రాలో కచ్చితంగా ఉంది! ఆ ఛాన్సు ఇవ్వకూడదన్నదే టీ టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. టీ టీడీపీ నేతలు కూడా ఇదే విషయం పదేపదే చెబుతూ ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదనీ, మహా కూటమిలో చేరాలంటూ కాంగ్రెస్ ను కూటమి అందరూ కోరారనే వాదన వినిపిస్తున్నారు. టీడీపీ పార్టీ పెట్టిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వ్యతిరేకించామనీ, భాజపా ఉన్నా అదే జరిగి ఉండేదని కదా అంటున్నారు.
సాంకేతికంగా, మహా కూటమి అభిప్రాయాన్ని తమ ఒక్కరిదే కాదని చెప్పే ప్రయత్నంలో టీడీపీ ఉంది. అయితే, అది టీడీపీ అభిప్రాయం కాదూ అని నమ్మే స్థాయిలో ఈ ప్రచారం ఉంటుందా.. అంటే, అనుమానమే! టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు.. వేర్వేరు ద్వారాల నుంచి మహాకూటమిలోకి చేరినా, కలిసింది ఒక్కచోటికే ఒక్క లక్ష్యంతోనే కదా! కాబట్టి, ఆ లక్ష్యాన్ని మరింత బలంగా వినిపిస్తూ… తెరాసను ఓడించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మహా కూటమిలో తాము చేరామని టీడీపీ చెప్పుకుంటే మరింత ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ. పరిస్థితులు మారాయి. తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడ్డాయి. ఎక్కడి రాజకీయాలు అక్కడివే అవుతాయి కదా!