బీజేపీ – జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. కలిసి పోటీ చేస్తున్నాయి. ఇది బహిరంగం. ఆ పార్టీ నాయకులు విజయవాడలో కూర్చుని.. తమకు బలం ఉన్న చోట.. ఎక్కడెక్కడ పోటీ చేయాలో లెక్కలేసుకుటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల సర్దుబాటు చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి బలం ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో టీడీపీతో కలిసిపోతున్నారు జనసేన నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ దాట్ల బుచ్చిబాబు, జనసేన ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ సర్దుబాటు చేసుకున్నారు. 13 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ స్థానాలు జనసేనకు ఇచ్చారు. అలాగే పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మండల స్థాయిలో పొత్తులు కుదిరాయి.
తూ.గో జిల్లాలోని ఇతర చోట్ల కూడా జనసేన నేతలు.. టీడీపీ తో సర్దుబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు.. బీజేపీ కన్నా.. టీడీపీనే బెటర్ అని భావిస్తున్నారు. బీజేపీ – జనసేన రెండింటికి క్యాడర్ లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస ప్రాతినిధ్యం అయినా దక్కించుకోకపోతే.. మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయంలో… జనసేన కింది స్థాయి నాయకత్వం ఉంది. కింది స్థాయి వారికి కొన్ని పదవులు ఉన్నా.. భవిష్యత్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది.. ఇప్పుడు పంతాలకు పోయి.. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఇబ్బందికరమైన భావనలో ఉన్నారు.
బీజేపీ బలంగా ఉన్న చోట్ల… ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. జనసేన బలంగా ఉన్న చోట.. ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల.. వారి మధ్య పొత్తు బలంగానే ఉంది. విజయవాడ వంటి చోట్ల.. ఇరు పార్టీల మధ్య పొత్తు వల్ల.. ఇతర పార్టీల ఓట్లు బలంగానే చీలే అవకాశం ఉంది. పైగా పవన్ కల్యాణ్.. నేరుగా.. ప్రచార బరిలోకి దిగాలనుకుంటున్నారు. దీంతో.. విపక్ష పార్టీల ఓట్లు మరింత ఎక్కువగా చీలడం ఖాయంగా కనిపిస్తోంది.