జగన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోతున్న ప్రజలు, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ , జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని.. ఓట్లు, సీట్ల కోసం కాదని.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ ప్రకటించారు. పొత్తుల ప్రకటన తర్వాత తొలి సారిగా రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తొలి సమావేశం కావడంతో.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. రెండు పార్టీల నేతలు ఆరు అంశాలపై తీర్మానం చేశారు. ఉమ్మడి భేటీ పూర్తిగా రాష్ట్రం కోసం .. ప్రజల కోసమేనన్నారు. టీడీపీ, జనసేన మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యలు రావన్నారు. పవన్ చేపట్టే వారాహి యాత్రలకు, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరీ చేపట్టే పర్యటనలకు టీడీపీ – జనసేన పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.
చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని.. అందుకే 2014లో మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు. తాము వైసీపీకి, సీఎం జగన్కు వ్యతిరేకంకాదన్నారు. వైసీపీ విధానాలను, అరాచకాలను వ్యతిరేకిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. వైసీపీని అధికారంలో నుంచి దింపడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణతో ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోవాలని.. టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ అస్థిరతకు గురైందని, స్థిరత్వం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ వైరస్ పట్టుకుందని.. జనసేన, టీడీపీ వ్యాక్సిన్ కావాలని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు ఏ పార్టీని వదలడంలేదని, ప్రజలకు భరోసా ఇవ్వడం ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని.. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాము ఎన్డీఏలో భాగం అయినా ఏపీలో ప్రజల వైపు ఉన్నామన్నారు. చిత్రమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని..తాము వస్తే అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి.. ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు. ఓటర్ల జాబితా విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని.. రెండు పార్టీలు ఉమ్మడిగా ఈ అంశంపై పోరాడుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.