టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయంచారు. ఇరు పార్టీల అధినేతల సూచనలతో సమావేశమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించారు.
టీడీపీ జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు… ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ – జన సేన పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ ప్రయత్నించిందని అవి వర్కౌట్ కాలేదన్నారు. ఈ నెల 17 న చిలకలూరిపేటలో భారీ సభ నిర్వహణకు రెండు పార్టీల నిర్ణయించినట్టు తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికను అదే రోజు వివరిస్తామన్నారు. చరిత్ర సృష్టించేలా 10 లక్షల మందితో చిలకలూరిపేటలో సభ నిర్వహిస్తామన్నారు అచ్చన్నాయుడు.
అనంతరం మాట్లాడిన నాదెండ్ల మనోహర్… చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. సూపర్ 6 నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నామమని తెలిపారు. పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే అది సఫలం కాదని స్పష్టం చేసారు.