తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకున్నారు. ఎన్ని సీట్లు, ఏ ఏ స్థానాలు అన్నది కూడా ఖరారు చేసుకున్నారు. అధికారిక ప్రకటన పండగ ముగిసిపోయిన తర్వాత చేయనున్నారు. సీట్లు, స్థానాల విషయంలో వైసీపీ చేసే వికృత రాజకీయాలు జనసేన విషయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంతగా అసలు విషయాలు బయటకు రాకుండా సర్దుబాట్లు పూర్తి చేశారు. పవన్, నాదెండ్ల , చంద్రబాబుతో పాటు లోకేష్ అతి కొద్ది మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది.
పవన్ కల్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో హడావుడి చేసే వైసీపీ కోవర్టులను పక్కన పెడితే… జనసేన పార్టీ నేతలు.. క్యాడర్ పవన్ నిర్ణయాన్ని కాదనే పరిస్థితి లేదు. ఉభయగోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల్లోనే వారికి వారే అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే.. క్షేత్ర స్థాయి క్యాడర్ కలవకపోవడం అనే సమస్య ఉండదని గట్టిగా నమ్ముతున్నారు. పోటీ చేయబోతున్న స్థానాలపై స్పష్టత రావడంతోనే పవన్ కల్యాణ్.. కాకినాడలో మూడు రోజుల పాటు భేటీలు నిర్వహించారని చెబుతున్నారు.
త్వరలో ఆయన రాజమండ్రిలో కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లు తీసుకోవడం కన్నా.. పోటీ చేసిన సీట్లన్నింటిలో విజయం సాధించడం ముఖ్యమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అతి తక్కువస్థానాలకు పరిమితమవుతుందని ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతోంది.