ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త పొత్తులకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకోవాలని లెఫ్ట్ పార్టీలు, టీడీపీ నిర్ణయించుకున్నాయి. తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పని చేయాలని నిర్ణయించకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారంపై ఈ పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఏపీ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు ఈ నెల 23న పోలింగ్ జరుగనుంది. ఇందులో టీడీపీ మూడు పట్టభద్ర స్థానాలకు బరిలోకి దిగింది. ఉపాధ్యాయ స్థానాలకు మాత్రం పోటీ చేయడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు పీడీఎఫ్ కూటమిగా ఏర్పడి పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానాలన్నింటిలోనూ పోటీ చేస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే యాభై శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇందుకోసం భిన్నమైన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్య ఓట్లు ఉంటాయి. ఓటరు తనకు బాగా నచ్చిన వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మిగిలిన వారికి రెండో ప్రాధాన్య ఓటు.. మూడో ప్రాధాన్య ఓటు వేయవచ్చు. ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్య ఓట్ల ద్వారా ఏ అభ్యర్థీ గెలవకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు, ఆ తర్వాత మూడో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కిస్తారు. అన్నీ కలిపి ఎవరికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు చాలినన్ని ఎవరికీ రాకపోతేనే మిగిలిన రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. అందుకే రెండో ప్రాధాన్య ఓట్లు కూడా కీలకంగా మారాయి. ఈ రెండో ప్రాధాన్య ఓట్లు పరస్పరం వేసుకోవాలని కమ్యూనిస్టులు , టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వామపక్ష పార్టీలు కొంత కాలంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. అయితే ఎప్పుడూ పొత్తుల ప్రస్తావన రాలేదు. కలసి పని చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. స్థానిక ఎన్నికల్లోనూ ఎవరికి వారు పోటీ చేశారు. ఇప్పుడు వామపక్షాలు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు సిద్ధం కావడంతో… ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి సహకారం.. కలిసి వస్తే.. తదుపరి సాధారణ ఎన్నికల్లో ఇలాంటి సహకారంపై చర్చించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మహాకూటమి తరహాలో టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీల కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది.