మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాంతం రైతుల వద్ద నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించబోతోందని వాదిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కలిసి యుద్ధం ప్రకటించాయి. అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అవసరమైనధాని కంటే చాలా ఎక్కువగా భూసేకరణ చేస్తూ, దానిని పెద్ద పారిశ్రామిక సంస్థలకి, వ్యాపారస్తులకి, విదేశీ కంపెనీలకి ధారాదత్తం చేస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి భూమి పిచ్చి పట్టుకొందని వామపక్షాలు ఆరోపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తనేదో చక్రవర్తిని అన్నట్లుగా చంద్రబాబు నాయుడు చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ రైతుల భూములు లాక్కొంటున్నారని వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అసలు పోర్టు నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
వారి ఆరోపణలకి, వింర్శలకి రాష్ట్ర సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపి కొనకళ్ళ నారాయణ గట్టిగా సమాధానం చెప్పారు. దేవినేని మీడియాతో మాట్లాడుతూ, “రాజశేఖ రెడ్డి హయంలో లాగ మేమేమీ లక్షల ఎకరాలు తీసుకోవడం లేదు. మచిలీపట్నం పోర్టు కోసం కేవలం 14000 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాము. అది కూడా స్థానిక రైతులని ఒప్పించి, మెప్పించి తీసుకొంతామే తప్ప బలవంతంగా గుంజుకోదలచుకోలేదు. రాజశేఖర్ రెడ్డి హయంలో లక్షల ఎకరాలు క్విడ్ ప్రొ పద్దతిలో దోపిడీ అవుతుంటే నోరెత్తని నేతలు అందరూ నేడు వేదికలెక్కి అన్యాయం అయిపోతోందంటూ గగ్గోలు పెట్టడం చాలా విచిత్రం ఉంది. పోర్టుని వ్యతిరేకిస్తున్న ధర్మాన ప్రసాదరావు, సి. రామచంద్రయ్య తదితరులు గతంలో ఏనాడైనా మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఆలోచించారా? అక్కడ పోర్టు నిర్మాణం అయితే తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి ఎగుమతులు,దిగుమతులు మొదలవుతాయి. వాటి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పోర్టుకి అనుబంధంగా భారీ పారిశ్రామికవాడ కూడా నెలకొల్పాలని మా ప్రభుత్వం భావిస్తోంది. కనుక పోర్టు వస్తే ఎక్కువ లాభపడేది స్థానిక రైతులు, ప్రజలే. కానీ వారికంటే ముందు ప్రతిపక్ష నేతలు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి పని చేపట్టినా ప్రజలు ఏమనుకొంటారో అని ఆలోచించకుండా దానిని అడ్డుకోవడమే పనిగా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి,” అని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవడం చాలా తప్పే కానీ వాటికి ఆ అవకాశం కల్పిస్తున్నది మాత్రం ప్రభుత్వమేనని చెప్పక తప్పదు. అభివృద్ధి పేరిట అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా భూమిని సేకరిస్తునందునే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే విదేశాలలో మాదిరిగా చాలా తక్కువ స్థలంలోనే అత్యాధునిక పద్దతులలో పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, రాజధానిని నిర్మించడానికి ప్రయత్నించి ఉంటే ఎవరూ కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపగాలిగేవారే కాదు కదా! కనీసం ప్రతిపక్షాలు ఇంతగా విమర్శిస్తున్నా కూడా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోవడం విశేషం.