తెలంగాణాలో తెదేపా నేతలను, ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడాన్ని తప్పు పడుతున్న తెదేపా, ఆంధ్రాలో మళ్ళీ అదే తప్పు చేస్తోంది. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో నుండి తమంతట తాముగా వస్తున్న నేతలను మాత్రమే తెదేపాలో చేర్చుకొనేది. కానీ ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి తెదేపా, తెరాసలకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవలసిన అవసరం లేదనే చెప్పవచ్చును. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి కనుక చాలా బలంగా ఉన్నాయి. వాటికి బలమయిన క్యాడర్, నేతలు ఉన్నారు. కనుక అవి తమ స్వంత పార్టీ క్యాడర్, నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వారి ద్వారానే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకొని, వారికే ప్రభుత్వంలో అధికారం కల్పించి ఉండి ఉంటే ఆ రెండు పార్టీలు మరింత బలోపేతం అయ్యుండేవి.
కానీ అంత శ్రమ తీసుకొనే కంటే ప్రత్యర్ధ పార్టీలలో ‘రెడీమేడ్’ గా దొరుకుతున్న బలమయిన నాయకులను, వారి అనుచరులను పార్టీలోకి ‘డౌన్ లోడ్’ చేసుకోవడమే సులువని భావిస్తునందునే ఆ రెండు పార్టీలు ‘ఆకర్ష మంత్రం’ పాటించడం మొదలుపెట్టినట్లున్నాయి. తెలంగాణాలో తెరాస చేపట్టిన ఈ నేతలు, ఎమ్మెల్యేల ‘డౌన్ లోడింగ్’ వలన తెదేపా తుడిచిపెట్టుకుపోతుండటంతో, ఆ ‘ఐడియా’ నుండి ప్రేరణ పొందిన తెదేపా దానిని ఆంధ్రాలో అమలుచేయడం ద్వారా అక్కడ కూడా ప్రతిపక్షాలు లేకుండా తుడిచిపెట్టేయవచ్చని భావిస్తున్నట్లుంది. ఇటువంటి విపరీత ఆలోచనల వలన తాత్కాలిక ఆనందం, తాత్కాలిక విజయం దక్కవచ్చును కానీ దీర్ఘకాలంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ.
ఉదారణకు ఒకప్పుడు తెరాసలో తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమకారులు, తెరాస నేతలే ఉండేవారు. కానీ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీల నేతలతో పూర్తిగా నిండిపోయింది. అది పేరుకి తెరాస అయినప్పటికీ అది తెదేపా, కాంగ్రెస్, తెరాసల సంకర పార్టీగా రూపుదిద్దుకొంది. కనుక పేరుకి తెరసయే అధికారంలో ఉన్నప్పటికీ అధికారం చెలాయిస్తున్న వారు మాత్రం అందరూ బయట నుండి వచ్చినవాళ్ళే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ, తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణా కోసం, పార్టీ కోసం పని చేసిన వారికి, పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కకపోవడంతో పార్టీలో చాలా అసంతృప్తి నెలకొని ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కార్పోరేషన్ పదవుల పంపకం ఉంటుందని ఊరిస్తూ రోజులు దొర్లించుకొస్తున్నారు.
తెదేపా కూడా అదే తప్పు చేస్తోంది కనుక దానికీ ఈ సమస్యలన్నీ ఎదుర్కోక తప్పదు. వైకాపా ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, భూమానాగిరెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకోవడానికి పార్టీలో అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలను, అభ్యంతరాలను గమనించినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. వారిని పార్టీలో చేర్చుకొంటునప్పుడే అభ్యంతరాలు ఎదురవుతున్నప్పుడు, వారికే పదవులు కట్టబెట్టాలని ప్రయత్నిస్తే పార్టీలో అసమ్మతి భగ్గుమనడం ఖాయం. దాని వలన చివరికి పార్టీకే నష్టం కలుగుతుంది. అంటే కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక కాస్తా ఊడినట్లవుతుందన్న మాట.
ఇతర పార్టీల నుండి నేతలని, ఎమ్మెల్యేలని ఆకర్షించి బలపడాలని ప్రయత్నించిన ఏ రాజకీయ పార్టీ దీర్ఘకాలంలో లాభపడిన దాఖలాలు లేవు. కనుక రాజకీయ పార్టీలన్నీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం అలవరుచుకొంటే ఒక ఆరోగ్యకరమయిన రాజకీయ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాకాదని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీయే ఉండకూడదని రాజకీయాలలో వికృత దుస్సంప్రదాయాలను ప్రారంభిస్తే చివరికి వాటికి వారే బలవుతారని గుర్తుంచుకోవాలి.