ఇప్పుడు తుఫాన్లకి కూడా పేర్లు పెట్టుకొంటున్నాము. అదేవిధంగా ఉగ్రవాదుల దాడులను 26/11వంటి తేదీలు ఇచ్చుకొన్నాము. ఆ లిస్టులతో బాటు ఇప్పుడు తాజాగా మరొక సరికొత్త అంశం కొత్త నెంబరుతో ప్రజలు గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఏర్పడింది. అదేమిటంటే 11/22. ఇది దేని గురించి అంటే జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మోపిన చార్జి షీట్లు, ఓటుకి నోటు కేసులో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించిన సంఖ్య. ఓటుకి నోటు కేసు గురించి ఆంద్రప్రదేశ్ శాసనసభలో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ఏసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో దాఖలు చేసిన చార్జ్ షీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు 22సార్లు ప్రస్తావించబడింది అని అన్నప్పుడు దానికి జవాబుగా తెదేపా సభ్యులు జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ ఏకంగా 11 చార్జి షీట్లే వేసిందని అన్నిటిలో కూడా ఆయనే నెంబర్ వన్” అని జవాబిచ్చారు. అందుకు ఆ రెండు పార్టీల నేతలు సిగ్గుపడలేదు. కానీ వారు బయటపెట్టుకొన్న ఈ సరికొత్త కోడ్ నెంబర్: 11/22ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకొనే ఉంటారు. ఇకపై జగన్ అక్రమాస్తుల కేసు, ఓటుకి నోటు కేసు అని చేంతాడంత వాక్యం చదువుకొనే బదులు 11/22 అని సింపుల్ గా వ్రాసుకొంటే ఆ రెండు కేసుల గురించి ఆ రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయని అందరికీ సులువుగా అర్ధం అవుతుంది