కేవలం ఐదు రోజులు మాత్రమే సాగబోయే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రోజుల పుణ్యకాలం పూర్తయిపోయింది. ఈ మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చలు జరుగాకపోయినా ఆ పేరుతో అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు మంచి వినోదం పంచుతున్నాయి. కాకపోతే ఆ తప్పనిసరి వినోదం ఖరీదు చాలా ఎక్కువ. అయినా ప్రజలు దానిని భరించాలి తప్పదు. నిన్న అసెంబ్లీలో శ్రీమంతుడు సినిమా, జబర్దస్త్ కామెడీ షో గురించి శాసనసభలో రసవత్తరమయిన చర్చ జరిగింది. ఈరోజు సభలో కార్మిక శాఖమంత్రి అచ్చెం నాయుడు వైకాపాకి సైకోపార్టీ అని పేరు పెట్టుకోమని సూచించడంతో వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో స్పీకర్ సభని వాయిదా వేశారు.
అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈనెల 9 నుండి రాష్ట్రంలో రైతన్నల కోసం ప్రభుత్వం చంద్రన్నయాత్రలు నిర్వహించబోతోందని, ఆ సందర్భంగా ఇంతవరకు ఎంతమంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందీ వివరాలను తెలియజేస్తామని అన్నారు. దానిపై వైకాప ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, చంద్రన్న యాత్రలు అనేకంటే చంద్రన్న కరువు యాత్రలు అని పేరు పెట్టుకొంటే ఇంకా బాగుంటుందని ఎద్దేవా చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క రుణం కూడా పూర్తిగా మాఫీ చేయలేకపోయినా, చాలా చేసేసినట్లు ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం, దాని కోసం యాత్రలు కూడా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అధిక ధరలతో ఒకపక్క రాష్ట్రంలో ప్రజలు విలవిలాడుతుంటే, ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేప్పట్టకుండా, ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న తమనే తప్పు పడుతోందని రోజా విమర్శించారు.