రాజ్యసభలో కూడా ఏపీ సమస్యల విషయమై మరోసారి తీవ్ర స్వరాన్ని వినిపించారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి. ఛైర్మన్ వెంకయ్య నాయుడు చర్చకు అనుమతి ఇవ్వడంతో… మంగళవారం మధ్యాహ్నం ఏపీ హామీలపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చర్చను ప్రారంభిస్తూ… కేంద్రంపై విమర్శలు చేశారు సుజనా చౌదరి. విభజన చట్టంలోని అంశాలను, కేంద్రం ఇచ్చిన హామీలను భాజపా పూర్తిగా తుంగలోకి తొక్కేసిందనీ, దీంతో విభజనానంతరం ఆంధ్రా ప్రజల భవిష్యత్తు పూర్తి అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు.
చట్టసభల్లో ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలకు విలువ లేకుండా పోయిందనీ, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ఎలా అంటూ నిలదీశారు. దేశంలో జరుగుతున్న గ్యాంగ్ ఎటాక్ ల మాదిరిగానే.. ఆంధ్రాపై కేంద్రం మూకుమ్మడి దాడికి దిగుతోందని సుజనా విమర్శించారు. తమ దగ్గరున్న అధికార బలంతో ఆంధ్రాకి రావాల్సిన నిధులను, వనరులను కేంద్రం తొక్కిపెట్టడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కూడా తొక్కిపెట్టి, సమాఖ్య స్ఫూర్తికి నిలువునా భాజపా సర్కారు తూట్లు పొడిచిందని విమర్శించారు.
ఇక, ఇదే అంశమై రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మాట్లాడారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా సంజీవని అని తమ పార్టీ నమ్ముతోందనీ, అందుకే గడచిన నాలుగేళ్లుగా పోరాటం సాగిస్తోందన్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా సంజీవని కాదు అని చాలా స్పష్టంగా ఇదివరకే ప్రకటించిందని విజయసాయి వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ జోక్యం చేసుకుని… ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.
ఎలాగూ త్యాగం పేరుతో లోక్ సభ ఎంపీలతో రాజీనామాలు చేయించారు. తద్వారా ఏం సాధించారో వారికే తెలీదు. కనీసం రాజ్యసభలో ఉన్న వైకాపా నేతలైనా.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడతారూ అనుకుంటే… అక్కడ కూడా సొంత డబ్బానే వినిపిస్తున్నారు. ఆంధ్రాలో వైకాపా నాలుగున్నరేళ్లుగా పోరాటం చేశామని రాజ్యసభలో చెప్పుకుంటే ఏం జరుగుతుంది..? కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తే బాగుంటుంది. కేంద్రాన్ని నేరుగా నిలదీసేందుకు వైకాపా చేతిలో ఉన్న చివరి అవకాశం ఈ రాజ్యసభలో చర్చా కార్యక్రమం. ఇక్కడ కూడా టీడీపీపై విమర్శలకే పరిమితం అవుతున్న తీరు చూస్తుంటే… ఎలా అర్థం చేసుకోవాలి..?