పొత్తులపై టీడీపీ నేతల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవలి వరకూ చంద్రబాబుతో సహా అందరూ జనసేన పార్టీ కలిసి రావాలని పిలుపునిచ్చేవారు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదామనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఒంటరి పోటీ అనే సంకేతాలు పంపుతున్నారు. పొత్తుల్లేకుండానే గెలుస్తామని చెబుతున్నారు. ఇలాంటి నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పొత్తులపై పార్టీ పెద్దల అనుమతి లేకుండా మాట్లాడే అవకాశం ఉండదు. వారి సూచనలతోనే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే.. ఎన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసినా మ్యాండేట్ ఏకపక్షంగా వస్తుందని ఇటీవలి ఎన్నికలు నిరూపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికలనే ఉదాహరణకు తీసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు ప్రజలు. ప్రత్యామ్నాయంగా ఆప్‌ను ఎంచుకున్నారు. దళిత నేతను సీఎంగా ఉంచినా వర్కవుట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో .. పొత్తులు పెట్టుకోవడం కూడా అనవసర ప్రయాసేనన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది.
పైగా పొత్తులు పెట్టుకుంటే.. వారి కోసం పార్టీని కొంత త్యాగం చేయాలి. సీట్లు కేటాయించాలి. అంతకు మించి.. టీడీపీ గురించి వారు మాట్లాడే మాటలను భరించాలి. గతంలో అనుభవాలు అలాగే ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు. టీడీపీ వల్ల బీజేపీ జాతీయ స్థాయిలో బలపడిందనేది నిజమని .. కేంద్రంలో బీజేపీ తొలి ప్రభుత్వం టీడీపీ వల్లనే ఏర్పడినా తమ వల్ల నష్టపోయామని ప్రచారం చేస్తూంటారని.. గత నాలుగేళ్లుగా వారెంతో బలపడ్డారో తెలుస్తోంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం ఇతర పార్టీలతోనూ వర్తిస్తుందని అంటున్నారు. ప్రజలు కావాలనుకుంటే టీడీపీని ప్రత్యామ్నాయంగా చూస్తారని లేకపోతే లేదని అంత మాత్రం దానికే పొత్తలంటూ హడావుడి పడటం దేనికని కొంత మంది టీడీపీ సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు.