తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. అసలు కసరత్తే చేయలేదని అనుకుంటున్నా.. చంద్రబాబు అందరితో మాట్లాడి.. అనూహ్యంగా అభ్యర్థిని ఖరారు చేసేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మినే అభ్యర్థిగా ఖరారు చేశారు. వైసీపీ తరపున పోటీ చేసి.. ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాదరావు మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి.. పని చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అందరూ నేతలకు.. స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని… వైసీపీ పట్టుదలతో ఉంది. అయితే అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ విధానం ప్రకారం.. ఎంపీ స్థానాల్లో.. ఎవరికీ పెద్దగా పరిచయం లేని వారిని నిలబెడుతూ ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వ్యూహం పని చేస్తుందేమో కానీ ఉపఎన్నికల్లో పని చేస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే సానుభూతి కోణంలో బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకే సీటు ఇచ్చే అవకాశం ఉన్న ప్రచారం కూడా వైసీపీలో జరుగుతోంది.
ఇక గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పదహారు వేల ఓట్లు తెచ్చుకున్న బీజేపీ కూడా .. గెలుపు తమదేనని ఉత్సాహపడుతోంది. రెండు, మూడు సార్లు సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. గెలిచేస్తామని ప్రకటనలు కూడా చేస్తున్నారు. బలమైన అభ్యర్థి కోసం ఇతర పార్టీల నుంచి వెదుకుతున్నారు. తిరుపతి ఉపఎన్నిక ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.