వైసీపీ ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించింది. తర్వాత పార్టీ తరపున అంటూ గృహసారధుల్ని నియమించింది. ఇప్పుడు వారికి కౌంటర్‌గా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాధికార సారధుల్ని నియమించాలని నిర్ణయించారు. అయితే యాభై ఇళ్లు చూసుకోవడం కష్టమని.., ప్రతి ముఫ్పై ఇళ్లకు ఒకర్ని నియమిస్తామని జగ్గంపేటలో ప్రకటించారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పులు పనులు చేయించుకోలేకపోయమని కొంత మంది కార్యకర్తలు బాధపడ్డారని.. ఈ సారి మాత్రం ప్రత్యేక వ్యవస్థ పెట్టి .. అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ కార్యకర్తకు పని అవసరం అయినా .. పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్‌ఛార్జ్‌లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు.
సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యవస్థ నియామకాలు జరిగాయా.. చంద్రబాబు నియమించాలని అనుకుంటున్నారా అన్నది స్పష్టత లేదు. అయితే వాలంటీర్లను నియమించినప్పుడే టీడీపీ కూడా.. ఇా ప్రతి ముఫ్పై ఇళ్లకు ఓ నేతకు బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. వీరి దగ్గర్నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారని.. ఎన్నికల సమయంలో వీరికే కీలకంగా వినియోగించుకుంటారని చెబుతున్నారు.
మొత్తంగా రాజకీయ పార్టీల రాజకీయం మైక్రో లెవల్ కు వెళ్తోంది.ప్రతీ ముఫ్పై ఇళ్లపై ఒక్కో రాజకీయ పార్టీకి చెందిన నేత గురి పెట్టి ఉండబోతున్నారు. ఓ రకంగా నిఘా లాంటిదే అనుకోవచ్చు.