నాలుగు కాదు నాలుగు వందల బస్సుల్లో రండి ఏపీలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని ఏపీ మంత్రులు కేటీఆర్కు సవాల్ చేశారు. అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ నుంచే కాదు అన్ని పొరుగు రాష్ట్రాల నుంచి ఇంకా కావాలంటే.. ఆ పొరుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నేతల్ని.. ప్రముఖుల్ని తీసుకొచ్చి ఏపీని చూపించాలని నిర్ణయించారు. అయితే ఇలా నిర్ణయించింది వైసీపీ నేతలు కాదు టీడీపీ నేతలు. ఏపీలో పరిస్థితుల్ని.. పాలనను చూడాలంటే టీడీపీ పొరుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని ఆహ్వానిస్తోంది. బుద్దా వెంకన్న బహిరంగా ఆహ్వానం పలికారు కూడా.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేని టీడీపీ చెబుతోంది. కావాలంటే తాము దగ్గరుండి చూపిస్తామని అంటోంది. ఈ విషయంలో ఒక్క టీడీపీనే కాదు సీపీఐ నారాయణ కూడా అదే మాట అనడం కాదు.. ఆయన నేరుగా వీడియో తీసి చూపించారు కూడా. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని .. పాలనా వైఫల్యాన్ని .. ఇతర ప్రభుత్వ విధానాల్లోని లోపాలను మరింత ప్రభావవంతంగా బయట పెట్టాలని వైసీపీ నేతలు ఇచ్చిన ఆహ్వానాన్నే ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పొరుగు రాష్ట్రాల నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అలాంటి వారిని ఏపీకి తీసుకొచ్చి చర్చ పెట్టడమో.. మరో రకంగా సమస్యల్ని హైలెట్ చేయడమో పెద్ద విషయం కాదు. ఈ దిశగా కూడా టీడీపీ ఆలోచన చేస్తోందని.. బుద్దా వెంకన్న ప్రకటనతోనే తేలిపోయింది. టీడీపీ ఈ వ్యూహం పాటిస్తే రాజకీయంగా వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్లే వచ్చి చూడాలని సవాల్ చేశారు కాబట్టి… టీడీపీ వాళ్లు తీసుకొచ్చి చూపించాలని డిసైడయ్యారు.