తెదేపా సీనియర్ నేత జెఆర్. పుష్పరాజ్ కి రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉందని నిన్న సాయంత్రం వరకు వార్తలు వచ్చాయి. కానీ ఆఖరు నిమిషంలో ఆయన స్థానంలో కర్నూలుకి చెందిన టిజి వెంకటేష్ పేరు ఖరారు అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తప్పకుండా తనకి రాజ్యసభ సీటు ఇస్తారని పుష్పరాజ్ చాలా ఆశపడ్డారు. కానీ ఆఖరు నిమిషంలో ఆయనని పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారు. అనంతరం ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ “ఒకప్పుడు ఎన్టీఆర్ హయంలో తెలుగుదేశం పార్టీకి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు పార్టీ కోసం పనిచేసేవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు కానీ ఇప్పుడు డబ్బున్నవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పని చేసినా, ఎంత సీనియర్ అయినా పార్టీలో విలువ, ప్రాధాన్యం ఉండదు. ఎప్పుడు పదవుల పంపిణీ జరిగినా నాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈసారి నన్ను బయట గదిలో ఉంచి మరీ రాజకీయం చేయడం నాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.
రాన్రాను ఎన్నికలు మరీ ఖరీదైన వ్యవహారంగా మారుతుండటం, తప్పనిసరిగా అధికారంలోకి రావాలనే రాజకీయ పార్టీల తాపత్రయం, ఖర్చుకి వెనుకాడని అభ్యర్ధులు వంటి అనేక కారణాల చేత ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ డబ్బున్న వ్యక్తులనే ఎన్నికల బరిలో నిలుపుతున్నాయి. ఒక పార్టీ అటువంటి బలమైన అభ్యర్ధిని నిలబెడితే, అప్పుడు మిగిలిన పార్టీలు కూడా తప్పనిసరిగా అందుకు ధీటైన వ్యక్తులనే నిలబెట్టవలసివస్తోంది. ఈ ఎన్నికల జూదంలో నీతి, నిజాయితీ, పార్టీకి సేవ వంటివేవీ లెక్కలోకి తీసుకోబడవు.
రాజ్యసభ సీట్ల కేటాయింపుకి అటువంటి సమస్య లేకపోయినప్పటికీ, అప్పుడు కూడా డబ్బున్నవాళ్ళకే సీట్లు కట్టబెడుతుండటం వలన, పుష్పరాజ్ వంటి సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతోంది. ఆవేదన పొందుతుంటారు. ఇప్పుడు ఎవరూ కూడా ఈ పరిస్థితులను, పద్దతులను మార్చలేనంతగా తయారయింది. కనుక పుష్పరాజ్ వంటి నేతల రోదన అరణ్యరోదనే అవుతుంది. అయితే ఇది ఇప్పుడు ఏ ఒక్క పార్టీకో పరిమితమైన సమస్య కాదు. అన్ని పార్టీలలోనూ ఉన్నదే.