తెలుగుదేశం పార్టీ అనూహ్యగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. విజయవాడ నేత పంచుమర్తి అనూరాధకు చాన్సిచ్చింది. ఆమె నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మొత్తం ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడింటికి వైసీపీ అధినేత జగన్ అభ్యర్థులను ప్రకటిచారు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ఏడు స్థానాలకు అంటే… ఒక్కో ఎమ్మెల్సీకి 25 ఓట్లు కావాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఉన్నారు. వారిలో నలుగురు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. కానీ ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం లేదు. వేస్తే అనర్హత వేటు పడుతుంది. ఇలా విప్ ను ధిక్కరించిన తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టలేరు. ఇప్పుడు అనర్హతా వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయి. అదో పెద్ద సమస్య. అదే సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. వారు ధిక్కరించినా వేటు వేసేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధంగా లేదు. ఆవిషయం సజ్జల గతంలోనే ప్రకటించారు. టీడీపీలో చేరుతామని చెబుతున్నారని..ఇక వారిపై ఏం చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంత మంది అందుబాటులో ఉండరన్న అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగవని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓ ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు వేయలేకపోయినా సీన్ మారిపోతుంది. ఈ వ్యూహంతోనే టీడీపీ రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రెబల్స్ కు కొత్త కష్టం తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.