ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు రాజ్యాలను పాలించే సమయంలో వారి తదనంతరం వారి కుమారులకు మాత్రమే రాజులు లేదా చక్రవర్తులయ్యే అవకాశం ఉండేది. ఆ అనువంశిక అధికారాలు నేటికీ మన దేశంలో అన్ని రంగాలలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని కొడుకు ప్రధాని అవుతాడు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు. సినిమా హీరో కొడుకు సినిమా హీరో అవుతాడు. ఇది చాలా సర్వసాధారణమయిన విషయంగానే పరిగణింపబడుతోంది. అందుకే నెహ్రూ వారసుడిగా పుట్టినందుకు దేశాన్ని పాలించేహక్కు తమకే ఉందని రాహుల్ గాంధి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకయినందుకు ఆయన చనిపోగానే తనకి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అధికారం ఉందని జగన్మోహన్ రెడ్డి దృడంగా నమ్మగలుగుతున్నారు. కనుక ఆ అనువంశిక రూల్ ప్రకారం తన కుమారుడు నారా లోకేష్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీకి అధ్యక్షుడు అవ్వాలని చంద్రబాబు నాయుడు ఆశపడితే తప్పేమీ లేదు.
పదేళ్ళు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని కటోర తపస్సు చేసి, వేల మైళ్ళు కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని శాస్వితం చేసుకొని, తన కొడుకు నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆ ప్రయత్నాలలో భాగంగానే రాష్ట్రంలో వైకాపాని తుడిచిపెట్టేసి తనకు పోటీ లేకుండా చేసుకోవాలనుకొంటున్నారు. ఆ రూల్ ప్రకారమే తన కొడుకు నారా లోకేష్ ని ముందుగా తన మంత్రి వర్గంలోకి తీసుకొని తన శిక్షణ, రక్షణలో రాటు తేలేలా చేయాలనుకొంటున్నారు.
ప్రభుత్వం ఏదయినా ఒక కీలక నిర్ణయం తీసుకొన్నప్పుడు, దానిపై ప్రజల, ప్రతిపక్షాల స్పందన ఏవిధంగా ఉందో తెలుసుకోవాలనుకొంటే, ముందుగా దాని గురించి ఎవరో ఒకరి ద్వారా మీడియాకి లీకులు ఇస్తుంది. దానికి వచ్చిన స్పందన బట్టి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళుతుంది. లోకేష్ విషయంలో ఇప్పటికే ఆపని పూర్తయిపోయింది. పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా నెగెటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు కనుక తరువాత దశలో జరుగవలసిన తతంగం అంటే ‘లోకేష్ భజన’ కార్యక్రమం మొదలయిపోయింది. అందరికంటే ముందుగా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ భజన కార్యక్రమం ప్రారంభించేసారు. నేడు నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ “నారా లోకేష్ సేవలు రాష్ట్రానికి చాలా అవసరం ఉన్నాయి. ఆయనని మంత్రివర్గంలో తీసుకోవాలనే చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను,” అని చెప్పారు. బహుశః ఇక నుండి తెదేపాలో అందరూ పోటాపోటీగా లోకేష్ భజన మొదలుపెట్టేస్తారేమో? దీనిని ముహూర్త సమయం వరకు కంటిన్యూ చేస్తూ లోకేష్ మంత్రి కావలసిన అవసరం గురించిప్రజలలో కూడా అవేర్ నెస్ తీసుకువచ్చే ప్రయత్నాలు గట్టిగా చేయవచ్చును.