తెలంగాణ లో తెలుగుదేశం- భాజపా మైత్రీబంధం చరమాంకానికి వచ్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారవుతున్న రాష్ట్రంలో .. తాము ప్రత్యేకంగా వారితో జతకట్టి సాధించేది ఏముంటుందంటూ.. భాజపా రాష్ట్ర నాయకులు కేంద్రనాయకత్వానికి చెబుతున్నట్లుగా సమాచారం. తెదేపాతో బంధాన్ని తెంచుకోకపోతే గనుక.. భాజపాకు ఉన్న కార్యకర్తలు కూడా దూరం అవుతారనే సంకేతాలను రాష్ట్ర నాయకులు తమ నివేదికల్లో పేర్కొంటున్నారు. వరంగల్ ఎంపీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా చోట్ల తెదేపా అభ్యర్థులు కూడా పోటీగా రంగంలోకి దిగి భాజపా అవకాశాలను నాశనం చేయడం ఇలాంటి నేపథ్యంలో.. ఆ పార్టీతో పొత్తు గురించి కార్యకర్తల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లుగా రాష్ట్ర నాయకులు కేంద్రనాయకత్వానికి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వరంగల్ ఎంపీ స్థానం తమకే కావాలంటూ తెదేపా చాలా కాలం పట్టుబట్టి చివరికి దాన్ని భాజపాకే కేటాయించింది. అయితే వారికి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకరించలేదనే ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆ పార్టీకి ఆ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి కూడా దూరం ఉన్నారనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్లుగానే ఎర్రబెల్లి ప్రస్తుతం తెరాసలో చేరిపోయారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెదేపా తో భాజపాకు తలనొప్పులు పరాకాష్టకు వెళ్లాయని చెప్పాలి. ఎందుకంటే.. భాజపాకు కేటాయించిన స్థానాల్లో కూడా తెదేపా వారు నామినేషన్లు వేసేయడం, వారిని వేయనివ్వకుండా అడ్డుకోవడం, వారి ఓటమికోసం పనిచేయడం ఇలాంటివి చాలా జరిగాయి. తెదేపా గనుక పూర్తిస్థాయిలో సహకరించి ఉంటే భాజపాకు కనీసం మరో అయిదారు డివిజన్లు దక్కి ఉండేవని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట.
ఆ తర్వాతి పరిణామాల్లో నారాయణఖేడ్ ఎన్నికల్లో తెదేపా పరిస్థితి ఏంటో తేలిపోయింది. ఈలోగా అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు మూడింట రెండో వంతు మార్కు చేరేలా.. తెరాసలోకి ఫిరాయించే పర్వమూ పూర్తయింది. ఎమ్మెల్యేలకు తగినట్లుగా పార్టీ శ్రేణులు కూడా గులాబీ రంగు పులుముకు న్నాయనడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఇంకా తెలుగుదేశాన్ని నమ్ముకుని స్నేహబంధం కొనసాగించడంలో అర్థం లేదని ఇక్కడి భాజపా నాయకులు అంటున్నారు.
అయితే కేంద్ర నాయకత్వం ఆలోచన మరో విధంగా ఉంది. ఒక పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అయినప్పుడు వారితో వారికి బలం ఉన్న రాష్ట్రంలో తాము అధికారం పంచుకుంటూ.. మరొక రాష్ట్రంలో కనీసం పొత్తుల్లేకుండా పక్కన పెట్టేస్తూ.. అవకాశవాద ధోరణిని ప్రదర్శించలేం కదా అనేది వారి వాదన. అలా చేస్తే భాజపా సిద్ధాంతాల పార్టీగా కాకుండా, అవకాశవాద పార్టీగా ముద్రపడుతుందని భయపడుతున్నారు. పైగా మళ్లీ ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి ఉన్నందున.. ఇప్పట్లో పొత్తులు, తెగతెంపుల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతానికి యథాతథ పరిస్థితిని కొనసాగిస్తే.. రాబోయే మూడేళ్లలో అంతిమ నిర్ణయం తీసుకోవచ్చుననే తరహాలో పార్టీ కేంద్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.