ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో తెదేపా, బీజేపీ నేతలు, ఎంపీలు ఎన్ని మాటలు, హామీలు గుప్పిస్తున్నప్పటికీ, ఈ విషయంలో తెదేపా ఎంపీలు రాయపాటి సాంభశివరావు, జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన మాటలే అసలు సంగతిని బయటపెడుతున్నాయి. “రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని, ఈ విషయం గురించి ప్రధానితో మాట్లాడుదామనుకొన్నా ఆయన ఎప్పుడూ విదేశాలలోనే తిరుగుతుంటారని” రాయపాటి అన్నారు.
“తాము చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసామని అయినా కేంద్రాన్ని మాత్రం ఈ విషయంలో ఒప్పించలేకపోయామని, ఇక తామేమీ చేయలేమని” ఆయన తన నిస్సహాయత వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి నిన్న అనతపురంలో మీడియాతో మాట్లాడుతూ,”మేమందరం ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలిసి మాట్లాడినప్పుడు వారందరూ విభజనతో దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిదాల ఆధుకొంటామని గట్టిగా హామీ ఇచ్చారు. అందుకు అవసరమయిన ప్రత్యేక ప్యాకేజి ఇవ్వగలమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వలన రాష్ట్రానికి హోదా ఇవ్వలేమన్నట్లుగా మాట్లాడారు. కనుక ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు,” అని జేసీ విస్పష్టంగా చెప్పారు. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ వారం రోజుల క్రితం పార్లమెంటులో చేసిన ప్రకటన కూడా ఆయన మాటలను ద్రువీకరిస్తోంది.
రెండు నెలల క్రితం కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ప్రత్యేక హోదాపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అన్నారు. కానీ మొన్న తెదేపాకి చెందిన ఒక నేత మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (నవంబర్-డిశంబర్ నెలలో జరగవచ్చును) ముగిసిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెపితే తాము రాజకీయంగా దెబ్బ తింటామనే భయంతోనే తెదేపా ఎంపీలు, నేతలు ఈవిధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ తమ పార్టీకి తామే స్వయంగా ఎసరు పెట్టుకొంటున్నారు.
దీని గురించి ఎవరు ఏమి చెపుతున్నప్పటికీ జేసీ, రాయపాటి చెప్పినదే నిజమని నమ్మవచ్చును. కనుక ప్రతిపక్షాలు, ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే సంగతి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పకుండా ఈ విధంగా ప్రజలను ఇంకా మభ్యపెట్టలేమని, అలాగ చేస్తే చివరికి తామే అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే సత్యాన్ని అధికార తెదేపా, బీజేపీలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల గురించి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లయితే రెండు పార్టీలు కూడా ఈ సమస్య నుండి తక్కువ నష్టంతో బయటపడగలవు. లేకుంటే చివరికి అవే నష్టపోక తప్పదు.