జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బీజేపీలు కలిసి ‘శంఖారావం’ బహిరంగ సభ నిర్వహించేయి. ఆ సభలో రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కె.టి.ఆర్.పై నిప్పులు చెరిగారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాసకు 100 సీట్లు రాకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? అని మంత్రి కె.టి.ఆర్. విసిరిన సవాలును తను స్వీకరిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతే కాదు ఒకవేళ తెరాసకు 100 సీట్లు వచ్చినట్లయితే తను రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి తెలంగాణా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోతానని ప్రకటించేరు. మంత్రి కె.టి.ఆర్. కూడా తన సవాలుకి కట్టుబడి ఉండాలని కోరారు.
కేసీఆర్-కె.టి.ఆర్.ల మధ్య హరీష్ రావు ఆటలో అరటిపండులాగ మారిపోయారని ఆయన ఎక్కడ కనబడకుండా పోయారని ఎద్దేవా చేసారు. కేసీఆర్ తన కొడుకు కె.టి.ఆర్.ని ముఖ్యమంత్రిని చేయాలని పగటి కలలు కంటుంటే, కె.టి.ఆర్. తనకి మంత్రి పదవే చాలా ఎక్కువని చాలా నిజాయితీగా ఉన్న మాటని ఒప్పుకొన్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.
తన తండ్రి కేసీఆర్ భోలాశంకరుడని, ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తారని నిజామాబాద్ ఎంపి కవిత చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి తనదయిన శైలిలో బాష్యం చెప్పారు. “అవును నిజమే. కేసీఆర్ నిజంగానే భోలాశంకరుడే..కానీ ప్రజలకి కాదు తన కుటుంబ సభ్యులకి మాత్రమే. ప్రతీ ఏటా తన కూతురు బతుకమ్మ పండుగ చేసుకోవడానికి రూ.10 కోట్లు ఇస్తుంటారు. తన కొడుకు, అల్లుడు బంధువులకి అడిగినంత ఇస్తుంటాడు. కానీ తెలంగాణా ప్రజల చేతిలో చిప్ప పెడుతుంటాడు,” అని అన్నారు.
హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మడం లేదు కనుకనే ఆయన తన కొడుకు కె.టి.ఆర్. ని ప్రచారానికి పంపిస్తున్నారని ఎద్దేవా చేసారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేసి దాని చుట్టూ వంద అంతసుల భవనాలు కడతానని, హైదరాబాద్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్కై వేలు నిర్మిస్తానని, ఎర్రగడ్డలో సచివాలయం నిర్మిస్తానని, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తానని, ఇలా నిత్యం కధలు చెపుతూ కేసీఆర్ రోజులు దొర్లించేస్తున్నారు తప్ప ఈ 19నెలల పాలనలో ఒక్క హామీని నేరవేర్చారా? ఒక్క కొత్త కట్టడాన్ని నిర్మించారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎంతో మంది త్యాగాలు చేసి సాధించుకొన్న తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురు చేతిలో బందీ అయిపోయిందని, దానిని మళ్ళీ వారి చేతిలో విడిపించుకోవడానికి అందరూ కలిసిమారో పోరాటం చేయవలసి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకప్పుడు స్తబ్దంగా ఉండే హైదరాబాద్ నగరానికి ఐటి రంగాన్ని తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బాటలు వేసారని, ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్ నగర నిర్మాణం, ట్యాంక్ బండ్ సుందరీకరణ, హుస్సేన్ సాగర్ లో బుద్ధా విగ్రహం ఏర్పాటు, హైదరాబాద్ టెక్ సిటీ వంటివి ఏర్పాటు చేసిన ఘనత తమ పార్టీదేనని, కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తోందని ఆక్షేపించారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణాకి దూరం అవుతున్నారనే ప్రచారం వాస్తవం కాదని, ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు, తెలంగాణా ప్రజల కోసం ఎప్పుడు పిలిచినా వస్తారని అందుకు ఈ సభకు ఆయన హాజరవడమే ఒక నిదర్శనమని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణాలో తెదేపా కార్యకర్తలు ఎవరినీ చూసి భయపడిపోనవసరం లేదని, ఒకవేళ కె.టి.ఆర్. వస్తే అతనిని ఎదుర్కొనేందుకు తాను వస్తానని, కేసీఆర్ వస్తే చంద్రబాబు నాయుడు వస్తారని, కేసీఆర్ తన తాతని తీసుకువస్తే తాము ప్రధాని నరేంద్ర మోడిని తీసుకువస్తామని పార్టీ కార్యకర్తలకి అభయం ఇచ్చేరు.