ఎప్పుడెప్పుడా అని అన్ని పార్టీలు ఎదురుచూసిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు వచ్చేసాయి. “తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి” అన్నట్లుగా రాజకీయ పార్టీలన్నీ టికెట్లు పంచి పెట్టేశాయి..అవి దొరకని వాళ్ళు నిజంగానే తన్నుకొంటున్నారు. నామినేషన్ల ఉపాధ్యక్షుడు సంహరణ గడువు కూడా పూర్తయిపోయింది కనుక ఇక రేసులో ఉన్నవాళ్ళు అందరూ ప్రచారానికి దిగుతారు. రెబెల్స్ ని బుజ్జగించేందుకు అన్ని పార్టీలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
ఈ గ్రేటర్ ఎన్నికలలో తెదేపా, బీజేపీలు రెండూ కలిసి పోటీ చేస్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే అది వారికి తప్పకుండా మంచి అడ్వాంటేజ్ అయ్యుండేది. కానీ ప్రస్తుతం రోహిత్ ఆత్మహత్య కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. దేశంలో చాలా రాజకీయ పార్టీల నేతలందరూ పనిగట్టుకొని హైదరాబాద్ వచ్చి బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోతున్నారు. ఆ ప్రభావం ప్రజల మీద పడినట్లయితే బీజేపీ నష్టపోయే ప్రమాదం ఉంది. దానితో బాటు తెదేపా కూడా నష్టపోవచ్చును. ఈ ఎన్నికలలో తెదేపా పోటీ చేస్తున్న మెజారిటీ స్థానాలలో గెలిచినా, ఒకవేళ బీజేపీ చతికిలపడితే చేతికి అందివచ్చిన విజయం చేజారిపోవచ్చును. ఇదే సూత్రం బీజేపీకి కూడా వర్తిస్తుంది. కనుక రెంటిలో ఒకటి గెలిచి రెండవది చతికిలపడితే దాని వలన రెండూ నష్టపోతాయి. కనుక గ్రేటర్ పగ్గాలు చేప్పట్టాలంటే రెండు పార్టీలు తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుంది.