ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీ వెళ్లినప్పుడు సమస్యలకు, సవాళ్ళకు అతీతంగా తెదేపా-భాజపాల స్నేహం కొనసాగిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా తదితర హామీల గురించి ప్రధానితో గట్టిగా మాట్లాడివస్తానని అధికారులతో కలిసి రెండు రోజుల పాటు కసరత్తు చేసిన ముఖ్యమంత్రి, ప్రధానితో సమావేశం తరువాత హామీల అమలు గురించి ఆయన ఏమ్మన్నారో చెప్పలేదు. కానీ మీడియా ఆశిస్తున్న ‘మసాల వార్త’ ఏదీ తను చెప్పబోవడంలేదని అనడం గమనిస్తే, భాజపాతో తెగతెంపుల చేసుకోవడం లేదని చెప్పినట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే మీడియాకి అదే మంచి మసాల వార్త అవుతుందని అందరికీ తెలుసు.
హామీల అమలుపై ప్రధాని మళ్ళీ ఎటువంటి హామీ ఇవ్వకపోయినా స్నేహంగా ఉందామని చెప్పారు కనుక, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కూడా అందుకు అంగీకరించి ఉండవచ్చు. కానీ ఆ స్నేహం డిల్లీ వరకే పరిమితం చేసి రాష్ట్ర భాజపాతో కయ్యానికైనా, నెయ్యానికైనా తెదేపా సిద్దం అయినట్లు ఆ పార్టీ ఎంపి రాయపాటి సాంభశివరావు మాటలతో అర్ధం అవుతోంది.
భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజధాని అమరావతికి అన్ని లక్షల కోట్లు ఎందుకు? అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయానికి, రాజధాని అమరావతిలో కార్యాలయానికి ఏమిటి తేడా? గుజరాత్, ఛత్తీస్ ఘడ్ రాజదానుల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు ఖర్చయితే, అమరావతికి లక్ష కోట్లు ఎందుకు? చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు అడిగితే అన్నీ ఇవ్వడం సాధ్యం కాదు,” అంటూ చాలా మాట్లాడారు.
దానికి తెదేపా ఎంపి రాయపాటి సాంభశివరావు చాలా ఘాటుగా బదులిచ్చారు. “సోము వీర్రాజుకి రాజధాని గురించి ఏమి తెలుసని దాని గురించి మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతున్నారు. వాటి వలన తెదేపా-భాజపా సంబంధాలు దెబ్బతింటాయి. అంతే కాదు అటువంటి మాటల వలన భాజపాకి కూడా చాలా నష్టం కలుగుతుందని తెలుసుకొంటే మంచిది. తెదేపాతో కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది భాజపాయేనని ఆయన గ్రహిస్తే మంచిది. ఇకనయినా అయన రెండు పార్టీల సంబంధాలు చెడే విధంగా మాట్లాడుకోవడం తగ్గించుకొంటే మంచిది,” అని అన్నారు.
తెదేపా హామీల గురించి కేంద్రాన్ని నిలదీస్తుంటే, రాష్ట్ర భాజపా నేతలు తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి స్పందించకుండా ఉండాలని ఆశించడం అత్యాశ, అవివేకమే అవుతుంది. ఒకవేళ మిత్రధర్మానికి కట్టుబడి రాష్ట్ర భాజపా నేతలు తెదేపా ఆరోపణలకు దీటుగా జవాబులు చెప్పలేకపోతే, ప్రజల దృష్టిలో వారిని తెదేపా దోషిగా నిలబెడుతోంది కనుక వారు తప్పనిసరిగా గట్టిగానే ఖండిస్తుంటారు. అది సహజమే. కానీ హామీల అమలు కోసం వారు కూడా తమ అధిష్టానంపై నిరంతర ఒత్తిడి చేయడం మంచిది. అప్పుడు వారు కూడా తమను తాము సమర్ధించుకొంటూ ధైర్యంగా మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకోబోవడం లేదనే విషయం స్పష్టమయింది కనుక, ఇక నుంచి ఆ రెండు పార్టీల నేతలు యధా ప్రకారం ఒకరినొకరు విమర్శించుకొంటూ వచ్చే ఎన్నిక వరకు ఇలాగే కాలక్షేపం చేసేయవచ్చు. అప్పుడు ప్రజలే ఎవరిది తప్పో నిర్ణయిస్తారు.