ప్రస్తుతం ఏపీలో మిత్రపక్షాలయిన తెదేపా-బీజేపీల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకొంటున్నారు. ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకొనే స్థాయికి చేరుకొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తాము తెదేపాకి గుడ్ బై చెప్పి ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి తెదేపాని ఎదుర్కొంటామని హెచ్చరిస్తే, తెదేపాతో దయతో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు మంత్రి పదవి దక్కనందుకే తెదేపాను విమర్శిస్తున్నారు..ఆయన హద్దు మీరితే తగిన విధంగా బుద్ధి చెపుతామని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా జవాబిచ్చారు. పనిలో పనిగా ఆయన పురందేశ్వరి, కావూరి సాంభశివరావు, కన్నా లక్ష్మీనారాయణలకు కూడా చురకలు వేసారు. బీజేపీ నేతలు బహుశః మళ్ళీ అంతకంటే ఘాటుగా ఆయనకి బదులీయవచ్చును.
వారి యుద్ధం చూస్తుంటే ఇక నేడోరేపో తెదేపా-బీజేపీలు విడిపోవడం ఖాయం అనిపించేలా ఉంది. కానీ వారు నిజంగానే విడిపోతారా? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాద్యం కాదనే చెప్పవచ్చును. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి ఆధారపడున్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు మోడీపై ఆధారపడి ఉంటే, రాష్ట్రంలో నిలద్రొక్కుకొనేందుకు బీజేపీ తెదేపాపై ఆధారపడి ఉంది. కనుకనే ఒకరినొకరు అయిష్టంగా భరించవలసి వస్తోంది. అయితే ఆ రెండు పార్టీలలో ఒకదానిపట్ల మరొకదానికి దాగి ఉన్న అసంతృప్తి అప్పుడప్పుడు అగ్నిపర్వతం నుంచి లావాలా ఇలాగ విరజిమ్ముతోంటుంది. అందుకు ఆ రెండు పార్టీల అధిష్టానాల సమ్మతి, అనుమతి రెండూ ఉన్నాయి కనుకనే వాటి నేతల మధ్య యుద్ధం కొనసాగుతోందని భావించవచ్చును. తద్వారా తాము ఎదుటపార్టీ మీద ఆధారపడిలేమని, ఎదుటివాళ్ళే తమపై ఆధారపడిఉన్నారని కనుక తమతో జాగ్రత్తగా మర్యాదగా వ్యవహరించమని ఒకరినొకరు హెచ్చరించుకొంటున్నట్లుంది.
వారు చేస్తున్న ఈ పోరాటాల వలన మరో గొప్ప ప్రయోజనం కూడా ఉంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి కోసం రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించవచ్చును. అలాగే బీజేపీతో తెదేపా తెగతెంపులు చేసుకోన్నట్లయితే బీజేపీతో జత కట్టాలని ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న వైకాపాను కాంగ్రెస్|పార్టీతో చేతులు కలపకుండా ఇంకా ఆశగా ఎదురుచూస్తూ ఉంచవచ్చును. అందుకే తెదేపా, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు బాణాలు వేసుకొంటున్నప్పటికీ వాటి అధిష్టానాలు అడ్డుపడటం లేదని భావించవచ్చును. కనుక వారి పోరాటం మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు సాగుతూనే ఉండవచ్చును. కానీ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరూ ఇదేమీ చూడనట్లు, తెలియనట్లు మామూలుగానే వ్యవహరించవచ్చును.