ఆ మధ్యన చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తరువాత భాజపాకి తమ పార్టీ తరపున రాజ్యసభ సీటు కేటాయించే ఆలోచన ఏమి లేదని ఖరాఖండిగా చెప్పారు. ఆ విషయంలో మళ్ళీ ఆయన కొంచెం మెత్తబడినట్లున్నారు. రాజ్యసభ సీటు కేటాయించమని భాజపా నుంచి అధికారికంగా తమకు ఎటువంటి అభ్యర్ధన రాలేదని ఆయన నిన్న అన్నారు. అంటే అభ్యర్ధన వస్తే సీటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సూచిస్తున్నట్లే భావించవచ్చు. అయితే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలను అమలుచేయనందుకు చాలా అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం మిగిలిన రెండు హామీలను అమలు చేయమని భాజపాని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమకు ఒకటి లేదా రెండు గవర్నర్ పదవులను కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కనుక రాజ్యసభ సీటుకి బదులుగా తమకు గవర్నర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరాలనుకొంటునట్లు తెదేపా నేతలు అనుకొంటున్నారు. ఇవ్వాళ్ళ గౌహతీలో అసోం ముఖ్యమంత్రి సోనోవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. దానిలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ గౌహాతీ వెళుతున్నారు. అక్కడ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఒకవేళ రాజ్యసభ సీటు కోసం అభ్యర్ధిస్తే, చంద్రబాబు నాయుడు తన డిమాండ్ల చిట్టాను ఆయన ముందు ఉంచవచ్చని తెలుస్తోంది. తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుకి గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు నాయుడు రెండేళ్ళ క్రితం హామీ ఇచ్చారు. ఒకవేళ ఆయనకు గవర్నర్ యోగం ఉంటే భాజపా-తెదేపాల మధ్య అంగీకారం కుదురుతుంది. లేకుంటే లేదు.