తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతోందంటూ ఢిల్లీలో బీజేపీ తమ అనుకూల మీడియాకు లీకులిచ్చింది. వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా మైండ్ గేమ్. టీడీపీ కూడా ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలేమీ దాచుకోవడం లేదు. కానీ.. ఇలా పిలవగానే అలా వచ్చి చేరబోమని.. ముందు వైసీపీకి దూరమని నిరూపించుకోవాలని వారంటున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా ప్రభుత్వంలో అవినీతి గురించి చెప్పిన తర్వాత..చర్యలెందుకు తీసుకోవడం లేదని చంద్రబాబు, అచ్చెన్నాయుడు పదే పదే ప్రశ్నించారు. బహుశా ఎన్డీఏలో చేరడానికి వారి ప్రధాన డిమాండ్ ఇదే కావొచ్చు.
అయితే వైసీపీ మాత్రం .. బీజేపీ .. తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ లో పడి.. తమను టార్గెట్ చేసుకోకుండా ఉండేందుకు అవసరం ఉన్న దాని కన్నా ఎక్కువగానే బీజేపీతో అంటకాగుతోంది. మీతోనే.. మీ వెంటే అంటూ జగన్ రెడ్డి హైకమాండ్ చుట్టూ తిరుగు తున్నారు. పైగా పార్లమెంట్ సీట్లు టీడీపీకి అసలు రావని.. అన్నీ తనకే వస్తాయని సర్వేలు వేయించుకుని వాటిని బీజేపీ హైకమాండ్ ముందు పెడుతున్నారు. ముందు ముందు యూనిఫాం సివిల్ కోడ్ లాంటి బిల్లులకు వైసీపీ మద్దతు అవసరం ఉంది. ఏం చేసినా ధిక్కరించే పరిస్థితి లేదు కానీ.. . సఖ్యతగా ఉన్న పార్టీపై చర్యలు ఎలా అనే సందేహం బీజేపీ నేతల్లో ఉంది.
వదలబోనంటూ కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ ఓ వైపు… టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలనుకుంటున్న బీజేపీ పెద్దల ఆలోచనలు మరో వైపు.. ఏపీ రాజకీయాల్ని సంక్లిష్టం చేస్తున్నాయి. జగన్ రెడ్డిపై ఇప్పటికిప్పుడు చర్యల విషయం తేల్చకుండానే టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవాలనేది బీజేపీ ప్లాన్. అలా సాధ్యం కాదనేది టీడీపీ పట్టు. అందుకే వైసీపీ ఎన్డీఏలోకి చేరుతుందనే లీకులు కూడా బీజేపీ ఇస్తోంది. అలా అయితే ఇంకా మంచిదని టీడీపీ సైలెంట్ గా ఉంటోంది. మొత్తంగా ఏపీలో మిత్రపక్ష పార్టీని ఎంచుకోవడం బీజేపీకి క్లిష్టంగా మారిందని అనుకోవచ్చు.