ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడుల అంశం ఇప్పుడు కొద్దిగా సద్దుమణిగినట్లుగా ఉంది. అయితే ఈ విషయాన్ని టీడీపీ, బీజేపీ వదిలి పెట్టడం లేదు. ఢిల్లీలో చర్చకు పెడుతున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. జీవో అవర్ లో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడు విగ్రహం తల తొలగించడం, అంతర్వేధిలో రథం దగ్ధం వంటి ఘటనలు జరిగినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యక్తులపై రాజకీయ ఆరోపణలు చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నప్రభుత్వం.. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని జీవీఎల్ రాజ్యసభలో కోరారు.
టీడీపీ ఎంపీలు ఈ అంశాన్ని బీజేపీ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. హోంమంత్రి అమిత్ షా దృష్టికి వారు తీసుకెళ్లనున్నారు. ఇందు కోసం టీడీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. అమిత్ షాకార్యాలయం కూడా వెంటనే వారికి అపాయింట్ మెంట్ ఖరారు చేసింది. సాయంత్రం వారు… అమిత్ షాను కలిసి.. ఏపీలోని పరిస్థితుల్ని వివరించనున్నారు. ఆలయాలపై దాడుల అంశం మాత్రమే కాకుండా.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడుల గురించి కూడా టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ సమయంలో కేంద్రం మద్దతు ఉందన్న అభిప్రాయం వైసీపీ నేతలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి.. ఇలాంటి ప్రచారాల ద్వారా బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుందని.. చర్యలు తీసుకోకపోతే.. వైసీపీకి మద్దతుగా బీజేపీ ఉందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుందని వారు అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. ఆలయాలపై దాడుల అంశం తో పాటు… ఏపీలో శాంతిభద్రతల అంశాన్ని ఢిల్లీలో చర్చకు పెట్టాలని… టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు.