తెలంగాణలో చాలామంది హేమాహేమీలు వచ్చి తమ పార్టీలో చేరతారన్న బిజెపి ఆశలు నిజం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు. కేంద్ర నాయకత్వం కూడా ఎందుకైనా మంచిదని టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల స్నేహపూర్వక వైఖరినే అనుసరించాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర బిజెపి నేతలు ప్రభుత్వంపై నిప్పులు కక్కుతుంటే కేంద్ర నాయకులు వచ్చి నీళ్లు చల్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పాత నేస్తమైన టిడిపితో పొత్తు తప్పదని బిజెపి నేతలు ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వంటి ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే టిటిడిపి ప్రతినిధులు మొదటినుంచి బిజెపితో పొత్తు వుంటుందనే చెబుతూవస్తున్నారు. అవసరమైతే తమ జెండా పక్కనపెట్టి ఎన్‌డిఎ పేరిట బిజెపి గుర్తుపైనే పోటీ చేసినా తప్పులేదన్నట్టు ఒకరిద్దరు సీనియర్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్‌తో సహా ఐక్యత అన్న రేవంత్ వాదన ఆయన స్వంత సిద్ధాంతమని తమకు ఆమోదం కాదని వారంటున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా దాన్ని తోసిపుచ్చారట. బిజెపితో సంబంధాల పునరుద్ధరణ తగు సమయం వచ్చినప్పుడు తాను చూసుకుంటానన్నట్టు సంకేతాలిచ్చారట. ఇక బిజెపి నేతలలోనూ చాలా మంది టిటిడిపితో వుంటే వారి ఓటర్లు యంత్రాంగం ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. ఈ జట్టులో టిఆర్ఎస్ పరోక్షంగా వత్తాసు నిచ్చినా ఆశ్చర్యం లేదని వారు వాదిస్తున్నారు. నల్గొండ ఎంపి సుఖేందర్‌రెడ్డిపై కోదండరామ్‌ను నిలబెడితే బావుంటుందని ప్రతిపాదన వచ్చింది గనక కెసిఆర్ వెనక్కు పోతున్నారని, ఇక నేరుగా వచ్చే శాసనసభ లోక్‌సభ ఎన్నికలకే సిద్ధం కావాలని చెబుతున్నారు.