ఢిల్లీలో బీజేపీ, వైసీపీ నేతల రహస్య భేటీల్లో ఒక్కో ఆసక్తికరమైన అంశం బయటకు వస్తోంది. ఒకే కారులో బయటకు వెళ్లి, వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వ్యవహారాన్ని మీడియా బయటపెట్టింది. దీంతో ఎమ్మెల్యేలిద్దరూ భగ్గుమన్నారు. అసలు తాము భోజనం చేయడానికి “షాంగ్రి” హోటల్‌కు వెళ్తే… రామ్‌మాధవ్ సహా అందర్నీ కలిసినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతా తెలుగుదేశం కుట్రేనని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఆకుల సత్యనారాయణ అయితే ఈ రోజు మీడియా సమావేశం పెట్టి… తమ మధ్య రహస్య భేటీ ఎక్కడ జరిగిందో.. రామ్‌మాధవ్‌ను ఎప్పుడు కలిశామో చెప్పాలంటూ.. సవాల్ చశారు. తాము షాంగ్రి హోటల్లో భోజనం చేయడానికి మాత్రమే ఢిల్లీకి వచ్చామన్నట్లుగా ఎంపీలు సమర్థించుకున్నారు. అసలు ఎవర్నీ కలవలేదన్నారు.
ఈ ఎమ్మెల్యేలిద్దరూ.. ఇలా సవాళ్ల మీద సవాళ్లు చేస్తూండగానే తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ఆంధ్రాభవన్‌కు సంబంధించిన కారునే ఎమ్మెల్యేలిద్దరూ ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలు కాబట్టి వారికి ఆ హక్కు ఉంది. అయితే నిబంధనల ప్రకారం… ఆ కారును తీసుకెళ్లే డ్రైవర్.. ఏ సమయానికి తీసుకెళ్తున్నారు.. ఎప్పుడు తీసుకొస్తున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయాన్ని కచ్చితంగా లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. వీరిద్దర్నీ బయటకు తీసుకెళ్లిన డ్రైవర్ కూడా రొటీన్‌గా అదే చేశారు. రామ్‌మాధవ్ ఇంటికి కారును తీసుకెళ్లినట్లు లాగ్‌బుక్‌లో రాశారు. డ్రైవర్లకు ఇలాంటి రూల్ ఒకటి ఉందని తెలియక ఎమ్మెల్యేలు ఇరుక్కుపోయారు. ఇక్కడే బీజేపీ, వైసీపీ ఎమ్మెల్యేలు దొరికిపోయారు. కారు రామ్‌మాధవ్ ఇంటికి వెళ్లినట్లు లాగ్‌బుక్‌లో నమోదు కావడంతో.. టీడీపీ నేతలు దాన్ని బయటపెట్టారు. ఇక ఇద్దరూ కలసి వస్తున్న దృశ్యాలను కూడా మీడియాకు ఇచ్చారు. ఇంకా ఏమైనా ఆధారాలు కావాలంటే ఇస్తామంటూ.. టీడీపీ నేతలు .. ఆకుల, బుగ్గనలను టీజ్ చేయడం ప్రారభించారు.
ఆకుల, బుగ్గన రామ్ మాధవ్ ఇంటికి వెళ్లిన సమయంలోనే ఆయన ఓ డొంక తిరుగుడు ట్వీట్ పెట్టారు. సౌత్ ఎవెన్యూలో.. దక్షిణాది కమల వికాసం కోసం… ఓ ముఖ్యమైన భేటీ జరిగిందనే అర్థంలో ట్వీట్ చేశారు. దీంతో రామ్‌మాధవ్ చెప్పిన ఆ ముఖ్యమైన సమావేశం… బుగ్గన, ఆకులతో భేటీనేనని భావిస్తున్నారు. అదే సమయంలో… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు రామ్‌మాధవ్ ఇంట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందరూ కలిసి చంద్రబాబుపై పోరాటానికి అజెండా ఖరారు చేసుకున్నారని భావిస్తున్నారు.
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ అమితంగా నమ్ముతారు. బుగ్గనకే వచ్చే ఎన్నికల్లో మొట్టమొదటి టిక్కెట్ ఖరారు చేశారు. మొదటి సారి ఎమ్మెల్యే అయినా పీఏసీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. జగన్‌కు ఇంత నమ్మకమైన వ్యక్తే ఢిల్లీకి వచ్చి చర్చలు జరిపారంటే… చాలా ముఖ్యమైన విషయాలేనన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది. బుగ్గన, ఆకుల ఎంతగా బుకాయించినా.. వాస్తవాలు కళ్ల ముందు కనపడుతూండటంతో.. వారు సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడింది.