లోక్ సభలో నిన్న ఒక సభ్యుడు ప్రత్యేకహోదాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఆర్.ఇంద్రజిత్ సింగ్ ఇచ్చిన సమాధానం తెదేపా, బీజేపీలను ఇరకాటంలో పడేసింది. “ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో లేవు. ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు కూడా. అటువంటి విధానం ఏదీ లేదు,” అని జవాబిచ్చారు.
కానీ సరిగ్గా నెలరోజుల క్రితమే కేంద్రమంత్రి సుజానా చౌదరి మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేకహోదాకి సంబంధించి 60 శాతం పనులు పూర్తయిపోయాయి. మరికొన్ని రోజుల్లో మిగిలిన పనులు కూడా పూర్తవగానే కేంద్రప్రభుత్వం దీనిపై ప్రకటన చేయబోతోంది,” అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇదే ఆ ప్రకటన అని భావించాల్సి ఉంటుంది. కానీ “ప్రత్యేకహోదాకి సంబంధించి 60 శాతం పనులు పూర్తయిపోయాయని చెప్పినప్పుడు, ఇంద్రజిత్ సింగ్ ఇటువంటి ప్రకటన చేయడమేమిటి?” అని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తెదేపా, బీజేపీలను నిలదీస్తారు.
ప్రత్యేకహోదాపై సుజానా చౌదరి చెప్పిన మాటలు నిజమనుకొంటే, త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సి ఉంటుంది. అదే నిజమనుకొంటే ఇంద్రజిత్ సింగ్ లోక్ సభ సభ్యులను త్రప్పు ద్రోవ పట్టిస్తున్నారనుకోవలసి ఉంటుంది. అలా కాక ఇంద్రజిత్ సింగ్ చెప్పినదే వాస్తవమనుకొంటే సుజానా చౌదరి, తెదేపా, బీజేపీలు ఉద్దేశ్యపూర్వకంగానే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
ఏమయినప్పటికీ ఇంద్రజిత్ సింగ్ చెప్పిన ఆ జవాబు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గొప్ప ఆయుధంగా అందివచ్చింది. తెదేపా, బీజేపీలు రెండూ కలిసి ‘ప్రత్యేకహోదా’ అంశంపై ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నాయని వైకాపా సీనియర్ నేత కె.పార్ధసారధి విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినా తెదేపా కేంద్రంలో భాగస్వామిగా ఇంకా ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు.
కాంగ్రెస్, వామపక్షాలు, ప్రత్యేకహోదా, ఇతర హామీల అమలు కోసం నటుడు శివాజీ అధ్యక్షతన ఏర్పడిన సాధనసమితి అందరూ కలిసి తెదేపా, బీజేపీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాటాలు మొదలుపెట్టడం తధ్యం. పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ రెండు ట్వీటులు తగిలించి మరింత వేడి పుట్టించవచ్చును. అప్పుడు మళ్ళీ షరా మామూలుగానే రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జరగవచ్చును. కానీ ఏమి చేసినా ప్రత్యేకహోదా వస్తుందా రాదా? అనే సంగతి ఒక్క మోడీకి తప్ప మరెవరికీ తెలియదు.