కేంద్రంలో, రాష్ట్రంలో భాగస్వాములుగా కొనసాగుతున్న తెదేపా-బీజేపీల మధ్య ఎటువంటి బంధం ఉందో అది ఎంత బలంగా ఉందో ఎవరికీ తెలియని విధంగా ఆ పార్టీల రాష్ట్ర నేతలు మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా లేదా వేరే ఏదయినా అంశంపై రాహ్స్త్రంలో తెదేపా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోగానే బీజేపీని విమర్శిస్తుంటుంది. కానీ మళ్ళీ అంతలోనే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు పొగుడుతారు. బీజేపీపై నోరు జారవద్దని తన పార్టీ నేతలను హెచ్చరించినట్లు మీడియాకి లీకులు ఇస్తుంటారు.
అదేవిధంగా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు డా. కామినేని శ్రీనివాస్ తదితరులు చంద్రబాబు నాయుడుని అతని ప్రభుత్వాన్ని తెగ మెచ్చుకొంటుంటే, అదే బీజేపీకి చెందిన పురందేశ్వరి, సోము వీర్రాజు, కంబంపాటి హరిబాబు తదితరులు విమర్శిస్తుంటారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చాలా సమర్ధంగా పరిపాలిస్తున్నారని, కేంద్రంతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహకారం చక్కగా పొందుతున్నారని వెంకయ్య నాయుడు మెచ్చుకొంటారు.
చంద్రబాబు నాయుడు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఒక వెస్ట్ ప్రాజెక్టు. దానిపై ప్రజా దానం వృధా చేయడం కంటే పోలవరంపై ఖర్చు చేయవచ్చు కదా అని పురందేశ్వరి చురకలు వేస్తుంటారు. సోము వీర్రాజు మరొక అడుగు ముందుకు వేసి అసలు పోలవరం కోసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల గురించి చంద్రబాబు నాయుడు పోలవరం అధారిటీకి కూడా తెలియజేయకుండా దేనిపై ఖర్చు చేస్తున్నారో? అని అనుమానాలు వ్యక్తం చేసారు. అంటే చంద్రబాబు నాయుడు ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. తెదేపాతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీని బలపరిచి ప్రత్యామ్నాయ శక్తిగా మలచడానికి తామందరం గట్టిగా ప్రయత్నిస్తామని పురందేశ్వరి చెపుతున్నారు.
తెదేపా-బీజేపీల మధ్య సాగుతున్న ఈ ముస్గులో గుద్దులాటలు బహుశః వచ్చే ఎన్నికలవరకు సాగుతాయేమో? అప్పటి పరిస్థితులను బట్టి తమ సంబంధాలు కొనసాగించడమో లేక ఎన్నికలలో పరస్పరం కత్తులు దూసుకోవడమో చేయవచ్చును. కానీ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా తొందరపడి తెదేపాతో కటీఫ్ చేసుకొంటే దానికే నష్టం. అటువంటి అవకాశం కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ తెదేపా, బీజేపీలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే బీజేపీతో జత కట్టేందుకు ఆయన సిద్దంగా ఉన్నారు. అందుకే ఆయన ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం గుంటూరులో చేస్తున్న నిరాహార దీక్షలో తెదేపానే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన కేంద్రాన్ని పలెత్తు మాట అనడం లేదు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆయనకీ అధికారం కట్టబెట్టారు. కేంద్ర సహకారం లేనిదే రాష్ట్రాభివృద్ధి చేయడం సాధ్యం కాదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలోగా అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తెదేపాని తిరస్కరించవచ్చును. అందుకే ఆయన కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈవిధంగా తెదేపా, బీజేపీలు ఒకదానిపై మరొకటి వేర్వేరు కారణాల చేత ఆధారపడక తప్పడం లేదు. అందుకే అవి కలిసి ప్రయాణిస్తున్నాయి. కానీ తమపై రెండవ పార్టీ ఏవిధంగా ఆధారపడి ఉందో ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకే బహుశః ఇటువంటి విమర్శలు చేసుకొంతున్నాయని భావించవచ్చును.