తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో, పార్టీ వ్యవహారాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నందున, అక్కడి పార్టీ నేతలకి తగిన నిర్ణయాలు తీసుకొనేందుకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో, వచ్చే నెలలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవలసిందిగా ఆయన పార్టీ నేతలని కోరారు. తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ మరి కొందరు సీనియర్ నేతలు నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యి ఈ ఎన్నికల గురించి చర్చించారు. ఈ రెండు ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని వారు నిర్ణయించుకొన్నారు.
వరంగల్ ఉప ఎన్నికల పరాభవం నేపధ్యంలో సీట్ల విషయంలో పంతాలకు పోకుండా ఎవరికి బలం ఉన్నచోట వారు పోటీ చేస్తూ పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించుకొన్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం ప్రభుత్వం డివిజన్ల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసి రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాత, ఏ డివిజన్లలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చించేందుకుమళ్ళీ సమావేశం అవుదామని నిర్ణయించుకొన్నారు. వరంగల్ ఉప ఎన్నికలలో ఓటమి, చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వలన రెండు పార్టీల మధ్య సయోధ్య ఏర్పడినట్లుంది. బీజేపీ హైదరాబాద్ లోనే చాలా బలంగా ఉంది. అలాగే హైదరాబాద్ జంట నగరాలలో ఆంధ్రా ఓటర్లు చాలా మంది స్థిరపడి ఉన్నందున తెదేపాకు జి.హెచ్.ఎం.సి. పరిధిలో మంచి పట్టు ఉంది. కానీ తెరాస మొదలుపెట్టిన అప్రకటిత ‘ఆపరేషన్ ఆకర్ష’ కార్యక్రమం వలన తెదేపాకు చెందిన బలమయిన నేతలు తెరాసలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోగలిగితేనే, జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెదేపా-బీజేపీలు విజయం గురించి ఆలోచించవచ్చును. లేకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాయే.