ఒక పని అనుకున్నట్టుగా, అనుకున్న సమయానికి జరిగిపోతే… అది వారి సమర్ధతకు కొలమానం! అదే పని అనుకున్నట్టుగా, అనుకున్న సమాయానికి జరగకపోతే.. అధికారుల అసమర్ధత, లేదా కేంద్రం చిన్నచూపు . పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇలాంటి ‘ముందస్తు జాగ్రత్త వాదన’ను చంద్రబాబు రెడీ చేసి పెట్టుకుంటోందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్నట్టుగా మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తైపోతే, ఆ ఘనత వారి ఖాతాలో జమ చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం కేంద్రం నుంచి అందుతున్న అరకొర సాయం నేపథ్యంలో ఆలస్యం అయిందనుకోండి… కచ్చితంగా అది కేంద్రం కిరికిరి అనేస్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ మధ్య కేంద్రం మోకాలడ్డటం ఎక్కువైపోతోందని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ దానికీ కొర్రీలు పెడుతోందనీ, అప్పటికీ చంద్రబాబు నాయుడు సాయశక్తులా కేంద్రంతో పోరాడి నిధులు సాధిస్తూ, పోలవరం పనులు సాగిస్తున్నారనే అంతరార్థం వచ్చేలా ఆ కథనంలో పేర్కొన్నారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గట్కరీ ఈ మధ్యనే పోలవరం సందర్శనకు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పనులు భేష్ అని మెచ్చుకున్నారు. కానీ, ఆయన వచ్చి వెళ్లిన తరువాతే కేంద్రం అభ్యంతరాలు పెరిగాయని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట! నష్టాల్లో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి కొన్ని పనుల్ని తప్పించాలని ఏపీ సర్కారు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి కేంద్రం అడ్డుతగిలిన సంగతి వాస్తవమే. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని కూడా కేంద్రం అనుసరిస్తున్న అభ్యంతరక వైఖరికి ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పి.పి.ఎ.) విషయంలో కూడా కేంద్ర వైఖరి మారిందని ఇదే కథనంలో చెప్పారు! ప్రాజెక్టు డిజైన్లన్నీ కేంద్ర జలవనరుల శాఖ దగ్గర అనుమతి లభించేలా చేయాల్సిన బాధ్యత పీపీయే ది అనీ, ఇప్పటివరకూ అలాంటి చొరవ చూపడం లేదనీ, అంతేకాదు… ఆంధ్రాకు అనుకూలంగా ఉంటున్నారన్న కారణంతో గత సభ్య కార్యదర్శిగా ఉన్న ఆర్కే గుప్తాను జలవనరుల శాఖ బదిలీ చేసిందని పేర్కొన్నారు.
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఈ కథనం అద్దం పడుతోంది. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం… పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రతీ సోమవారం సమీక్షలు జరుపుతున్నారు. అయితే, పనులు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదన్న అసంతృప్తిని ఈ మధ్య బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నుంచి అందాల్సిన సాయం అరకొరగా ఉంటోందని కూడా చెప్తున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇదే అంశంపై వెళ్లానని చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి… అన్ని ప్రాంతాలకూ నీళ్లు వచ్చేలా చేశామని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రం నుంచి మరింత సాయం అందాల్సి ఉంది. కానీ, ఆ సాయం వచ్చే ఎన్నికల్లోపు వస్తుందా అనే ప్రశ్న ఉండనే ఉంది. కాబట్టి, ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే… చంద్రబాబు పెట్టుకున్న డెడ్ లైన్ లోపు పోలవరం నిర్మాణం పూర్తి కాకపోతే, ముమ్మూర్తులా అది కేంద్రం వైఫల్యమే అనేది అప్పటికి ఎస్టాబ్లిష్ కావాలంటే.. ఇప్పుట్నుంచీ దానికో పునాది వేసి ఉంచాలి. ఇప్పుడు టీడీపీ సర్కారు చేస్తున్నది ఇదే. వారి మనసెరిగిన సదరు మీడియా రాస్తున్నదీ అదే!