పిల్లిని గదిలో బంధించి కొడితే పులి అవుతుందో లేదో కానీ.. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాత్రం.. ఆలాంటి సిట్యూయేషన్‌కి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. సందర్భంగా వచ్చిన ప్రతీ సారి తన పేరును లింక్ పెట్టి.. ” కాల్ మనీ సెక్స్ రాకెట్ ” అంటూ.. ఆరోపణలు చేస్తూండటంతో … మహిళా ఎమ్మెల్యే అన్న కారణంతో.. ఇంత కాలం పద్దతిగా సమాధానం చెబుతూ వచ్చారు. నిన్నటి నిన్న పెనమలూరు నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లి రోజా.. మళ్లీ బోడె ప్రసాద్‌ను “కాల్ మనీ సెక్స్ రాకెట్ “కి లింక్ పెట్టి ఆరోపణలు చేసేశారు. ఆమె అనడం సాక్షి పత్రికలో .. నియోజకవర్గ పేజీలో పెద్ద అక్షరాలతో వేసుకోవడం జరిగిపోయింది. దీంతో బోడెప్రసాద్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయారు. రోజాను చెడామడా తిట్టేశారు.
సౌమ్యుడైన బోడె ప్రసాద్ ఒక్కసారి స్వరం పెంచి.. రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో.. టీడీపీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. మూడేళ్ల నుంచి రోజా అంటున్న మాటలతో తన కడుపు రగలిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా ప్రవర్తన, ఆమె మాటలు వింటూంటే.. ఏదో “కంపెనీ” నడుపుకునే మహిళలా మాట్లాడుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ అలాంటి మాటలు మాట్లాడరంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. సాధారణంగా తన శత్రువులు ఎదురు వచ్చినా బోడె ప్రసాద్ ఆవేశానికి లోనైన సందర్భాలు తక్కువ ఉంటాయి. అయితే తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. రోజా మూడేళ్ల నుంచి “కాల్ మనీ సెక్స్ రాకెట్ “కి తన పేరును లింక్ చేసి చెబుతూండటంతో… కంట్రోల్ చేసుకోలేకపోయారు.
కొన్నాళ్ల క్రితం.. విజయవాడలో… కాల్ మనీ కేసు బయటపడింది. అందులో ఓ మహిళను..వడ్డీ వ్యాపారులు లైంగిక వేధింపులకు గురి చేశారని… సాక్షి మీడియా విస్తృత ప్రచారం చేసింది. కానీ పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని.. వడ్డీల పేరుతో వేధింపులు మాత్రమే ఉన్నాయని తేల్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ కాల్ మనీ కేసుకు మరింత.. పబ్లిసిటీ తేవడం కోసం.. “కాల్ మనీ – సెక్స్ రాకెట్” అంటూ వర్ణించడం ప్రారంభించారు.
ఈ కేసు బయటపడిన సందర్భంలో… కాల్ మనీ వడ్డీ వ్యాపారి, నిందితునిగా ఉన్న వ్యక్తి తో కలిసి బోడె ప్రసాద్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కలసి వెళ్లారన్న కారణంగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. బోడె ప్రసాద్ ను ఈ కేసులో కలిపేసి విమర్శలు చేయడం ప్రారంభించారు. అసలు ఈ కేసులో ముఖ్యమంత్రికే లింక్ ఉందంటూ… వైసీపీ నేతలు అసెంబ్లీలో విమర్శలు చేశారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యంగా సంబోధించడంతో..ఆమెపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. అయినా రోజా వెనక్కి తగ్గలేదు. “కాల్ మనీ – సెక్స్ రాకెట్ ” అనే పేరును ఏ మాత్రం సంకోచించకుండా .. పదే పదే చెబుతూ .. టీడీపీ నేతలను విమర్శించేస్తూంటారు.దానికి ఇప్పుడు బోడె ప్రసాద్ ఘాటు రిప్లయ్ ఇచ్చారు.