అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి కారణాలపై తెలుగుదేశం వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ విఫలమయ్యామనే విశ్లేషణ కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే… పార్టీలో పెద్దలుగా చెప్పుకుని తిరిగే కొంతమంది నాయకుల తీరు! 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఆ పెద్దల తీరులో మార్పు వచ్చిందనీ, కింది స్థాయి నాయకులతోగానీ పార్టీ కార్యకర్తలతోగానీ మర్యాదగా వ్యవహరించడం తగ్గించేశారనీ, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదనే వాదన ఇప్పుడు తెర మీదికి వస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు… ఎమ్మెల్సీ, టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీ ఛైర్మన్ వీవీవీ చౌదరి!
గత ఎన్నికల తరువాత పాలనా వ్యవహారాల్లో అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు బిజీగా మారిపోయారనీ, పార్టీకి సంబంధించిన బాధ్యతల్ని చౌదరి చేతిలో పెట్టారని అంటున్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉన్న ఆయనకి బాధ్యతలు పెంచారు. అక్కడి నుంచి ఆయన తీరు పూర్తిగా మారిపోయిందనీ, పార్టీ అధినాయకత్వానికీ కార్యకర్తలకీ మధ్యలో వారధిగా నిలివాల్సిన బాధ్యతను ఆయన పక్కనపెట్టేశారని ఇప్పుడు కార్యకర్తలు భగ్గుమంటున్నట్టు తెలుస్తోంది! పార్టీకి సంబంధించిన ఏదైనా అంశంపై మాట్లాడేందుకు ఆయన్ని కలిసేందు వెళ్తే… పట్టించుకునేవారు కాదనీ, గంటల తరబడి వెయిట్ చేయించేవారనీ, సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే చులకనగా మాట్లాడేవారంటూ కొంతమంది నేతలూ కార్యకర్తలూ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో వాపోతున్నట్టు సమాచారం. ఆయన తీరుపై అధినాయకత్వం వరకూ ఫిర్యాదులను గతంలో ఆయన వెళ్లనిచ్చేవారు కాదని అంటున్నారు.
గతంలో నామినెటెట్ పదవుల నియామకంలో ఈయన సిఫార్సులకే బాగా పనిచేశాయనే టాక్ ఉంది! క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి బాలేదని ఆయనకి ఎవరు చెప్పినా సీరియస్ గా తీసుకోలేదనీ, అంతా అద్భుతంగా ఉందంటూ చంద్రబాబు నాయుడుకి తప్పుడు నివేదికలు ఇస్తూ పక్కతోపట్టించారని కొంతమంది నేతలు ఇప్పుడు చెబుతున్నారు. పార్టీలో ఇలాంటివారి ప్రాధాన్యతన ఇకనైనా తగ్గాలనీ, లేదంటే పార్టీ కేడర్ కూడా ఇలాంటివారి అజమాయిషీలో పనిచేయడానికి ముందుకు రావడం కష్టమే అనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడుకి నేరుగా కొంతమంది నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీకి కులం ముద్ర పడటానికి ఇలాంటి వారి అత్యుత్సాహమే కారణమైందనీ, దీనిపై విస్తృత చర్చ జరగాలంటూ టీడీపీ కేడర్ లో ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదనగా తెలుస్తోంది.