భారీ ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే అధికార పార్టీ వైకాపా మీద విమర్శల దాడి పెంచి, పోరాటాలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది టీడీపీ అధినాయకత్వం. అయితే, కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఇంకా అలానే ఉంది. పార్టీ కార్యకర్తలు స్థానికంగా నాయకత్వం మారాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన నాయకుల ఆధ్వర్యంలోనే పార్టీ నడిస్తే ప్రయోజనం ఏంటనీ, ముందుగా అలాంటివారిని మార్చాలనే డిమాండ్ తెర మీదికి వస్తోంది. ఈ క్రమంలో వినిపిస్తున్న కొన్ని పేర్లు… సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ! నెల్లూరు జిల్లాలో టీడీపీలో క్రియాశీలంగా ఉండే నేతలు వీరు. అయితే, ఇప్పుడు జిల్లా పార్టీ కొత్త నాయకత్వం కిందికి మారాలనీ, అప్పుడే టీడీపీకి మంచిరోజులు వస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గత టీడీపీ హయాంలో జిల్లా నుంచి నారాయణ, సోమిరెడ్డి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుంటే… ఆ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలి. కానీ, గత ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. జిల్లాలో టీడీపీ ఓటమికి కారణం ఈ ఇద్దరు మాజీ మంత్రుల వైఖరే అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. వీరి హయాంలో పార్టీలో విభేదాలు పెరిగాయనీ, వారి చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత ఇస్తూ సాధారణ కార్యకర్తల్ని పక్కన పెట్టేవారంటూ కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. చివరికి గత ఎన్నికల సమయంలో కూడా సామాజిక సమీకరణాల పేరుతో ఇద్దరు నేతలూ పార్టీలో కింది స్థాయిలో కొందరు నాయకుల్ని దూరం పెట్టేవారేవారనీ, అందుకే గత ఎన్నికల్లో చివరికి నిమిషంలో టీడీపీకి వ్యతిరేకంగా సొంత కార్యకర్తలే పనిచేశారనీ అంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మూడోసారి పనిచేస్తున్న బీద రవిచంద్ర యాదవ్ ని కూడా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.
పార్టీ కోసం బలంగా పనిచేస్తున్న యువత చాలామంది ఉన్నారనీ, కానీ జిల్లా నాయకత్వంలో ఈ ముగ్గురు నేతలు ఉండటంతో… వారి చుట్టూ తిరిగే వారికి మాత్రమే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత దక్కుతూ వస్తోందనీ, కొత్త తరానికి అవకాశాలు రానివ్వడం లేదేనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలనీ, మాజీ మంత్రులు ఇద్దరికీ పార్టీ బాధ్యతలు కుదిరించి, వారి స్థానంలో యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమౌతోంది. ఈ పరిస్థితులపై విశ్లేషించాకనే పార్టీ తరఫున ఎలాంటి ఉద్యమాలైనా కార్యక్రమాలైనా నిర్వహంచాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. మరి, మాజీ మంత్రులు సోమిరెడ్డి, నారాయణలకు బాధ్యతలు తగ్గించడం అనేది టీడీపీ అధినాయకత్వానికి సాధ్యమయ్యే పనేనా..? అలాగని, వ్యక్తమౌతున్న ఈ సంతృప్తిని తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో ఇది సంక్షోభానికి దారి తీయ్యొచ్చు. పార్టీ అధినాయకత్వం ఈ పరిస్థితిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.