టీడీపీ నేతలతో కలిసి జోగి రమేష్ ఓ ర్యాలీలో పాల్గొనడం వైసీపీలో కన్నా టీడీపీలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జోగి రమేష్ జగన్ రెడ్డి మెప్పు కోసం చేసిన పనులు చిన్నవి కావు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఎంతో చేశారు. ఆ సమయంలో కేసులయ్యాయి. అయినా ఆయనను విచారణకు పిలవడం తప్ప చేసిందేమీ లేదు. ఇక వైసీపీ గెలిచిన తరవాత ఆయన చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మొదట పదవి ఇవ్వలేదని ప్రతిభా ప్రదర్శన మొదలు పెట్టారు. కొడాలి, పేర్ని లాంటి వాళ్లను మంత్రి పదవుల నుంచి తీసేసి తనకు ఇవ్వాలంటే ఏం చేయాలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన సూచనల మేరకు రెచ్చిపోయారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లారు. రఘురామకృరాజును సాక్షాత్తూ అసెంబ్లీలోనే బండబూతులు తిట్టారు. బయట ఇక ఎలా నోరు పారేసుకున్నారో చెప్పాల్సిన పని లేదు.
ఇవి పైకి కనిపించినవి. ఇక అంతర్గతంగా ఆయన చేసిన దోపిడీ ఎంతో చెప్పాల్సిన పని లేదు. మంత్రిగా ఉన్న కొంత కాలంలోనే వందల కోట్లు వెనకేశారని అంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల్నీ దోచుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో ఆయన టీడీపీ కి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ చాన్స్ వచ్చినప్పుడు కాళ్లు పట్టుకుని లాగేస్తాడు. అలాంటి వారిని ఏ మాత్రం సహించకూడదని టీడీపీ నేతలుఅంటున్నారు. కనీసం ర్యాలీలకు కూడా పిలువకూడదని కోరుకుంటున్నారు.
ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవడం ఆలస్యమవుతోంది. అలా ఆలస్యమవడం వేరు.. వారు టీడీపీ నేతలతో టచ్ లోకి రావడం సంచలనంగా మారుతోంది. ఇది టీడీపీ కార్యకర్తల్ని అసంతృప్తికి గురి చేస్తోంది. అలాంటి వారికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేనని కానీ దగ్గరకు తీసుకుని ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.