కూటమి ప్రభుత్వం రెండో నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల చేసిన తర్వాత ఎప్పుడూ లేనంత పాజిటివ్ టాక్ క్యాడర్ లో కనిపించింది. సామాన్య కార్యకర్తల్ని.. కష్టపడిన వారిని.. సీట్లు త్యాగం చేసిన వారిని గుర్తించడమే దీనికి కారణం. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం రెంట చింతలలో దాడులకు గురైనా ఏ మాత్రం తగ్గని మంజులా రెడ్డికి ఓ నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఈ నియామకం అందర్నీ సంతృప్తి పరిచింది. అలాగే టీడీపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షురాలిగా ఉండి చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీ సానుభూతిపరుల్ని చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపాలనుకున్న వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన తేజస్వి పొడపాటికి కూడా ఓ కార్పొరేషన్‌కు చైర్మన్ పదవి ఇచ్చారు.
అధికార ప్రతినిధులు, ఆనం వెంకటరమణారెడ్డి, జీవీ రెడ్డి, పట్టాభిరాంలకు ఈ విడతలో అవకాశాలు కల్పించారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న వారికి అవకాశాలు కల్పించారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం అందర్నీ సంతృప్తి పరిచేలా చేసంది. ప్రాధాన్యమైన పదవులు ..సీనియర్ నేతలకు ఇచ్చారు. మొదటి జాబితా విడుదల అయినప్పుడు కొన్ని అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ఇప్పుడు మాత్రం అంతా పాజిటివ్ స్వరాలే వినిపిస్తున్నాయి.
బీజేపీకి ఒకటి, రెండు పోస్టులతోనే సరి పెడుతున్నారు. జనసేనకు తొమ్మిది చైర్మన్ల వరకూ ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ సారి జనసేన నుంచి ఆ పదవి దక్కించుకున్నారు. ఆయన గత ఎన్నికల సమయంలో జనసేనకే పని చేశారు. ఇలా పలువురికి పదవులు లభించాయి. ఇంకా పలు కార్పొరేషన్లకు పదువులు భర్తీ చేయాల్సి ఉంది.
ఈ కార్పొరేషన్ల పదవుల స్థాయి కన్నా ఎక్కువగా ఉన్న సీనియర్లకు త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవులతో పాటు ఇత కేబినెట్ ర్యాంక్ గల పోస్టులను పరిశీలించే అవకాశం ఉంది.