ఒకే రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తల్ని వైసీపీ నేతలు హత్య చేశారు. ఒకటి కర్నూలు నగరంలో.. మరొకటి పుంగనూరులో జరిగింది. రెండూ రాజకీయ హత్యలే. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలు కాదు. అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోలేకపోవడం చిన్న విషయం కాదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది ?
కింది స్థాయిలో వైసీపీ ప్రభావం ఉన్న పోలీసులు
పోలీసు వ్యవస్థను వైసీపీ హయాంలో భ్రష్టుపట్టించారు. అన్ని చోట్ల వైసీపీ నేతలు చెప్పిన పని చేసే వారిని నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకూ మార్చారు. కానీ అది పై స్థాయిలోనే. కిందిస్థాయిలో ఇంకా పోలీసు అధికారులు వైసీపీ ప్రభావం ఉన్న వారే ఉన్నారు. వారు నేరాలు చేసే వైసీపీ నేతల పట్ల కఠినంగా ఉండటం లేదు. హత్యలు జరుగుతాయని తెలిసినా సైలెంటుగా ఉంటున్నారు. పుంగనూరులో జరిగింది ఇదే. సీతను..కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు కానీ.. అది ముందే చేయాల్సింది. ప్రాణ హాని ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేయడం దేనికి సంకేతం.
అధికారంలో ఉన్నామన్న సంగతిని మర్చిపోతే ఎలా?
కంటికి కన్ను..పన్నుకు పన్ను అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు కానీ.. సొంత పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోకపోతే అతి చేతకాని తనం అవుతుంది. హత్య జరిగిన తర్వాత చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటే ఏం ప్రయోజనం ఉంటుంది.. ముందుగా ప్రాణాల్ని కాపాడుకోవాలి. వైసీపీలో ప్రాణాలు తీసే నేరస్తులందరికీ బుద్ది చెప్పాలి. అలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలి. అలా వ్యవహరించే పోలీసు అధికారుల్నే ఆయా ప్రాంతాల్లో నియమించాల్సి ఉంది. చిత్తూరు ఎస్పీ తీరు వైసీపీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు వస్తున్నా… స్పందించడం ఆలస్యం కావడం వల్లే ఇలాంటి హత్యలు జరిగాయని అర్థం చేసుకోవచ్చు.
మరో ప్రాణం పోకుండా చూడగలరా ?
వినుకొండలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో హత్యలు జరిగితే.. జగన్ దానికి రాజకీయ హత్యలని ముసుగేసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఎనభై హత్యలు జరిగాయని అడ్డగోలు ప్రచారాలు చేశారు. నిజానికి ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా బలవుతున్నారు. ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండి.. మరో కార్యకర్త ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది.