పార్టీ , ప్రభుత్వం వేర్వేరు కాదు..రెండూ ఒకటే అని వైసీపీ హయాంలో పార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం పేరుతో నిర్వహించేవారు. అవి ఎంతగా జరిగేవి అంటే.. ఐఏసెస్లు, ఐపీఎస్లు పార్టీ కార్యక్రమం అయిన ఇంటింటికి వైసీపీ నిర్వహించేవారు. ఇలాంటివి లెక్కలేనన్ని జరిగాయి. కానీ ఇప్పుడు టీడీపీ దానికి పూర్తి విరుద్ధం. అసలు పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది.
క్యాడర్ మనోభావాలు దెబ్బతీసిన జీవీ రెడ్డి ఇష్యూ
ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీ రెడ్డి వ్యవహారం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున చురుకుగా వివిధ వేదికలపై తన వాదనలు వినిపించిన ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి వచ్చింది. అయితే అక్కడా ఆయన రాజకీయ నేతగానే వ్యవహరించడంతో సమస్య వచ్చింది. ఫైబర్ నెట్ చైర్మన్ గా తనకు ఉన్న అధికారాలను మించి ఏదో చేయాలనుకున్నారు. అయితే అదంతా ఆయన పార్టీ కోసం.. ఫైబర్ నెట్ కోసమే చేయాలనుకున్నారు . కానీ చేసిన విధానం వివాదాస్పదం అయింది. ఫలితంగా ఆయనతో రాజీనామా చేయించారు. ఆ ఆగ్రహంతో పార్టీకి కూడా రాజీనామా చేశారు.దాంతో కష్టపడిన కార్యకర్తలకు ఇదా గుర్తింపు అని కొంత మంది ప్రశ్నించడం ప్రారంభించారు.
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఓవరాక్షన్
అసలేం జరిగిందో తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం చేయరు..కానీ కొంత మంది టీడీపీ కార్యకర్తలు .. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ..కామెంట్స్ తో రెచ్చిపోతూంటారు. జీవీ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. చంద్రబాబు తీరును ప్రశ్నిస్తూ వందల పోస్టులు పెట్టారు. పార్టీ కోసం పని చేసిన వారిని చంద్రబాబు అయినా ఎందుకు వదులుకుంటారు ?. ముఖ్యమంత్రిగా.. ఆయన వ్యవస్థల గౌరవాన్ని కాపాడుతూ.. పార్టీని నిలబెట్టుకోవాలి. జీవీ రెడ్డి వైపు తప్పు జరిగిందన్నది నిజం. ఆయన ఆవేశపడ్డారు. అలాంటి సమయంలో పార్టీ పెద్దల సూచనలకు తగ్గట్లుగా వ్యవహరిస్తే సరిపోయేది. పార్టీ కోసం ఒకరిద్దరు కార్యకర్తలు, నేతలు కష్టపడితే అవదు కదా.. టీడీపీకి ఉన్న కార్యకర్తలంతా కష్టపడితేనే పార్టీ గెలుస్తుంది. అంతే కానీ ప్రతీ విషయంలో ఇలా నిష్ఠూరాలు ఆడుకుంటూ పోతే ఎవరికి నష్టం?
వైసీపీలా చేస్తే ఇక టీడీపీకి ఓటు వేయడం ఎందుకు?
మాట్లాడితే అందరూ వైసీపీ అయితే అలా చేసేది..అని సలహాలిస్తున్నారు. నిజమే.. వైసీపీలా లా లేదా.. వైసీపీ కన్నా మించి ఘోరంగా చేస్తే.. ఇక టీడీపీకి ఓట్లు వేయాలని ప్రజలు ఎందుకు అనుకుంటారు. ఆ మాత్రం దానికి వైసీపీ చాలదా అనుకోరా. రాజకీయాల్లో ఆవేశాలకు చోటు లేదు. కేవలం ఆలోచనలతోనే .. సమయానుకూలంగా ముందుకెళ్లాలి. వ్యవస్థల్ని కాపాడితే అవి మనల్ని కాపాడతాయన్న సంగతిని గుర్తు తెచ్చుకోవాలని చాలా మంది సూచిస్తున్నారు. అయితే టీడీపీ క్యాడర్ పేరుతో సోషల్ మీడియా క్యాడర్ మాత్రం గెలుపంతా మా వల్లే అన్నట్లుగా డైలాగులు కొడుతూ ప్రతీ దానికి ఇష్యూ చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం కూడా.. టీడీపీ కార్యకర్తల మనోభావాలను గుర్తించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ప్రకారం.. అనుకున్న నిర్ణయాలు తీసుకునేలా చేయాల్సి ఉంది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం చేసుకోవాలి. లేకపోతే ఈ సమస్యలు పెరిగిపోతాయి.