నెల్లూరు ఎంపి మేకపాటి రాజా మోహన్ రెడ్డి మొన్న నెల్లూరులో జరిగిన ఒక సభలో జగన్ సమక్షంలోనే కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “2014 ఎన్నికలలో మా పార్టీ చేసిన చిన్న చిన్న తప్పుల వలననే తెదేపా అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికలు మా పార్టీకి అగ్ని పరీక్ష వంటివి. కనుక ఆ తప్పులను సరిదిద్దుకొని వచ్చే ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తాము. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పడేశారు. ఆ కారణంగా ప్రజలలో చంద్రబాబు నాయుడుపట్ల నమ్మకం సడలింది. దీనిని మనం ఒక అవకాశంగా మలచుకొని తెదేపా ప్రభుత్వం చేస్తున్న ఈ మోసం గురించి ప్రజలకు వివరించి, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. గత ఎన్నికలలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి,” అని అన్నారు.
మేకపాటి చెపుతున్న ఆ మాటలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి చేపుతున్నవేనని అర్ధమవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు ఏమయినా చేశారా? చేస్తున్నారా? అంటే లేదనే జవాబు చెప్పవలసి ఉంటుంది.
2014 సార్ర్వత్రిక ఎన్నికలలో తెదేపా చేతిలో వైకాపా ఓడిపోయిన తరువాత, “తెదేపా ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచిందని, తాము నీతి నిజాయితీకి కట్టుబడి ఆవిధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఇష్టపడక పోవడం వలననే ఓడిపోయామని, ఆ ఎన్నికలలో తాము తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ‘అతివిశ్వాసం’ ప్రదర్శించడం వలననే ఓడిపోయామని, చాలా స్వల్ప ఓట్ల తేడాతో తెదేపా గెలిచిందని…ఇలా తమ ఓటమికి, తెదేపా గెలుపుకి అనేక కారణాలు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పుకొని బాధపడేవారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకమయినవే అయినా ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయ పార్టీలు డ్డీ కొంటునప్పుడు ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో వారే అంతిమంగా గెలుస్తుంటారు కనుక ఆ విషయంలో జగన్ విఫలమయ్యాడని చెప్పక తప్పదు.
అయితే కర్ణుడి చావుకి వెయ్యి కారణాలున్నట్లే, ఆ ఎన్నికలలో వైకాపా ఓటమికి, తెదేపా గెలుపుకి ఇంకా అనేక కారణాలున్నాయని అందరికీ తెలుసు. సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకొనే ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ తంతుని ‘మమ’ అనిపించేసి, ఆ మరునాటి నుంచి, తనను ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుపడినందుకు చంద్రబాబు నాయుడుపై జగన్ యుద్ధం ప్రకటించేశారు. నాటి నుండి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే వైకాపా పాలసీ అన్నట్లుగా సాగిపోతున్నారు తప్ప కనీసం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకొనే ప్రయత్నాలు చేయడం లేదు.
పార్టీలో సీనియర్లతో సలహా, సంప్రదింపులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి వరుసగా చేస్తున్న తప్పుల వలన, ఆయన స్వయంగా తెదేపా చేతిలో పదేపదే భంగపడటమే కాకుండా తన పార్టీ నేతలకు కూడా అవమానకర పరిస్థితులను నిత్యం ఎదుర్కోవలసి వస్తోంది. నిజానికి తెదేపా ప్రభుత్వం చేస్తున్న అనేక తప్పులను ఆయన బయటపెట్టి చాలా సమర్ధంగా నిలదీస్తున్నారనే చెప్పవచ్చును. కానీ చంద్రబాబు నాయుడుపై పగతో రగిలిపోతున్న కారణంగా, ఆ ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తెదేపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిన చోట తనే దోషిగా నిలబడుతున్నారు. నేటికీ ఆ విషయం ఆయన ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే పార్టీలో సీనియర్ల సలహా, సంప్రదింపులు చేయనందునేనని భావించవచ్చును.
మరి ఇప్పుడే ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి శల్యసారద్యం చేస్తున్నప్పుడు ఇంకా ఎన్నికలలో విజయం సాధించిపెట్టగలరా? అంటే అనుమానమే. వైకాపాకి జగన్మోహన్ రెడ్డే ప్రధాన సైన్యాధిపతి…ప్రధాన శత్రువు కూడా. కనుక ఆయనలోని ఆ అంతర్గత శత్రువుని వదిలించుకోనంత వరకు వైకాపా విజయం సాధించడం కష్టమేనని చెప్పక తప్పదు.